📅 డేట్ లోడింగ్... | ⏰ టైమ్ లోడింగ్...

Markapuram : అర్హులైన ప్రతి వెలుగొండ నిర్వాసితుడికి ప్రభుత్వం అండగా ఉంటుంది : ఎమ్మెల్యే కందుల

 

మార్కాపురం జిల్లా : మార్కాపురం: స్వచ్ఛవార్త :

వెలుగొండ ప్రాజెక్టు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే ఈ ప్రాంతంలోని రైతులు, యువతకు మరింత ప్రయోజనం కలుగుతుందని మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి సోమవారం మార్కాపురం పట్టణంలో మీడియా ముఖంగా అన్నారు. ప్రాజెక్టు ద్వారా సాగునీటి వసతులు మెరుగుపడి వ్యవసాయ రంగానికి కొత్త ఊపు వస్తుందని తెలిపారు.

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో వెలుగొండ ప్రాజెక్టు పనులు పూర్తికాకుండానే జాతికి అంకితం చేశారని ఎమ్మెల్యే విమర్శించారు. తెలుగుదేశం ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తూ ప్రాజెక్టు కోసం రూ.3 వేల కోట్లు ఖర్చు చేసిందని, మరో నెలలోపు వెలుగొండ సాగర్‌కు జలాలు అందిస్తామని పేర్కొన్నారు. ఇకనైనా వైఎస్సార్‌సీపీ నాయకులు యువతను రెచ్చగొట్టే ప్రయత్నాలు మానుకోవాలని హితవు పలికారు.

నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నాం :

వెలుగొండ ప్రాజెక్టు కారణంగా నిర్వాసితులైన ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కందుల నారాయణరెడ్డి స్పష్టం చేశారు. పెనుగొండతో పాటు ప్రాజెక్టు పరిధిలోని నిర్వాసిత గ్రామాల ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, అర్హత కలిగిన ప్రతి నిర్వాసితుడికి న్యాయం జరిగేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

పునరావాసం, పరిహారంపై ప్రత్యేక దృష్టి :

పునరావాసం, పరిహారం, కేటాయించిన ప్లాట్లలో మౌలిక వసతుల కల్పన తదితర అంశాలపై నిర్వాసితులు ఎదుర్కొంటున్న సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. వెలుగొండ నిర్వాసితుల తరఫున ప్రతి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, వారికి అవసరమైన సహకారం అందేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

షేర్ చేయండి: 📱 WhatsApp 📘 Facebook ✖️ X