📅 డేట్ లోడింగ్... | ⏰ టైమ్ లోడింగ్...

Thulluru : రాజధాని నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి – డాక్టర్ మనోజ్, అంబుల వైష్ణవి

అమరావతి, తుళ్లూరు/ ముదినేపల్లి : స్వచ్ఛవార్త :

ఆంధ్రుల ప్రజా రాజధాని అమరావతి అభివృద్ధి, నిర్మాణ పనులు వేగంగా పూర్తయ్యేందుకు ప్రతి ఒక్కరూ తమవంతు సహకారం అందించాలని అమరావతి బ్రాండ్ అంబాసిడర్ అంబుల వైష్ణవి, ఆమె తండ్రి డాక్టర్ మనోజ్ లు కోరారు.

ఆదివారం అమరావతిలో నిర్వహించిన ఓ ప్రైవేటు కన్స్ట్రక్షన్ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో డాక్టర్ మనోజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమరావతి అభివృద్ధిలో ప్రజలు భాగస్వాములు కావాలని, ప్రతి ఒక్కరూ రూ.116 చొప్పున విరాళం అందించి రాజధాని నిర్మాణానికి తమ వంతు సహకారం అందించాలని పిలుపునిచ్చారు.

అమరావతి అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తయ్యేలా మరింత మంది బిల్డర్లు, నిర్మాణ రంగ ప్రతినిధులు ముందుకు రావాలని డాక్టర్ మనోజ్ కోరారు. రాజధాని ప్రాంతంలో నిర్మాణ కార్యకలాపాలు పెరిగితే అభివృద్ధి మరింత వేగవంతమవుతుందని, అందుకు నిర్మాణ రంగం నుంచి విస్తృత సహకారం అవసరమని పేర్కొన్నారు.

కార్యక్రమంలో పాల్గొన్న కన్స్ట్రక్షన్ ప్రతినిధులు, పూజారులు అమరావతి అభివృద్ధికి మద్దతుగా క్యూ ఆర్ కోడ్ ద్వారా రూ.116 చొప్పున విరాళాలు అందజేశారు. ఏలూరు జిల్లా ముదినేపల్లి ప్రాంతానికి చెందిన వైద్య విద్యార్థిని అంబుల వైష్ణవి తన రెండెకరాల భూమిని విక్రయించి ఆ మొత్తాన్ని అమరావతి అభివృద్ధికి విరాళంగా అందించిన విషయం తెలిసిందే. ఆమె చూపిన చొరవను గుర్తించిన ప్రభుత్వం అమరావతి బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రకటించింది.

అమరావతి అభివృద్ధి, నిర్మాణంలో తన కుమార్తె అంబుల వైష్ణవితో కలిసి మరింత మందిని భాగస్వాములను చేసేందుకు కృషి చేస్తామని డాక్టర్ మనోజ్ తెలిపారు. రాజధాని త్వరగా అభివృద్ధి చెందేందుకు ప్రజలు, బిల్డర్లు, నిర్మాణ రంగ ప్రతినిధులు కలిసికట్టుగా ముందుకు రావాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.

షేర్ చేయండి: 📱 WhatsApp 📘 Facebook ✖️ X