Edepalli : ఘనంగా ఉప ముఖ్యమంత్రి పవన్ జన్మదిన వేడుకలు.. పలు అభివృద్ధి పనులకు శ్రీకారం
ఏలూరు జిల్లా : ముదినేపల్లి : స్వచ్ఛవార్త :
మండలంలోని ఈడేపల్లి గ్రామంలో బుధవారం జనసేన పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక జనసేన నాయకుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అస్యూరెన్స్ కమిటీ చైర్మన్, కైకలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే డా. కామినేని శ్రీనివాస్ పాల్గొని కేక్ కట్ చేసి పవన్ కళ్యాణ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం గ్రోవెల్ ఫీడ్స్ సంస్థ ఆర్థిక సహకారంతో ఈడేపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన బస్ షెల్టర్‌ను ఎమ్మెల్యే కామినేని ప్రారంభించారు. ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని బస్ షెల్టర్ నిర్మాణం చేపట్టడం అభినందనీయమని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
అదేవిధంగా రూ.57 లక్షల ప్రభుత్వ నిధులతో 1.048 కిలోమీటర్ల మేర చేపట్టనున్న నూతన బీటీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, ప్రజలకు మెరుగైన రహదారి సౌకర్యం కల్పించేందుకు అభివృద్ధి పనులను చేపడుతున్నట్లు తెలిపారు.
కార్యక్రమంలో ఎన్డీఏ నాయకులు, ప్రజాప్రతినిధులు, స్థానిక జనసేన నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.
