📅 డేట్ లోడింగ్... | ⏰ టైమ్ లోడింగ్...

Bapatla : ప్రశాంత ఎన్నికల నిర్వహణే లక్ష్యం : జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్

  • సమస్యాత్మక ప్రాంతాలపై నిఘా పెంచాలి.. పోలీస్ అధికారులకు ఎస్పీ ఉమామహేశ్వర్ ఆదేశాలు

బాపట్ల జిల్లా : బాపట్ల (స్వచ్ఛవార్త) :

స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో, పారదర్శకంగా నిర్వహించేందుకు పోలీస్ అధికారులు, సిబ్బంది సమన్వయంతో అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలని జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ ఆదేశించారు. గురువారం బాపట్లలోని ఎస్పీ క్యాంప్ కార్యాలయ సమావేశ మందిరంలో పోలీస్ అధికారులతో నిర్వహించిన నేర సమీక్ష సమావేశంలో ఎన్నికల భద్రత, శాంతిభద్రతలు, నేర నియంత్రణ, పెండింగ్ కేసుల దర్యాప్తుపై ఆయన సమీక్షించి పలు సూచనలు చేశారు.

సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా :

ఎన్నికల నేపథ్యంలో పోలీస్ అధికారులు తమ పరిధిలోని గ్రామాలు, వార్డులను తరచూ సందర్శించి క్షేత్రస్థాయి పరిస్థితులను అంచనా వేయాలని ఎస్పీ సూచించారు. గత ఎన్నికల్లో చోటుచేసుకున్న ఘటనలు, వివాదాలను దృష్టిలో ఉంచుకుని అవి పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని, సున్నితమైన పోలింగ్ కేంద్రాలను తరచూ సందర్శించి అవసరమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

ఎన్నికల సమయంలో ఘర్షణలకు పాల్పడే అవకాశం ఉన్న రౌడీషీటర్లు, పాత నేరస్థులు, గతంలో ఎన్నికల వివాదాలకు కారణమైన వ్యక్తులను గుర్తించి చట్టప్రకారం బైండోవర్ చేయాలన్నారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, పోలీస్ హెచ్చరికలను బేఖాతరు చేస్తూ పదేపదే నేరాలకు పాల్పడే వారిపై అవసరమైన చట్టపరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. ఓటర్లను భయపెట్టడం, ప్రలోభాలకు గురిచేయడం, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నాలను సహించేది లేదని స్పష్టం చేశారు.

నగదు, మద్యం అక్రమ రవాణాపై నిఘా :

జిల్లా సరిహద్దులతో పాటు అవసరమైన అంతర్గత ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టుల వద్ద నిరంతరం వాహన తనిఖీలు నిర్వహించాలని ఎస్పీ ఆదేశించారు. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు అక్రమంగా తరలించే నగదు, మద్యం, ఇతర వస్తువుల రవాణాను అడ్డుకోవాలన్నారు. తనిఖీల సమయంలో అనుమానాస్పద నగదు, వస్తువులను స్వాధీనం చేసుకునేటప్పుడు సంబంధిత చట్టాలు, ఎన్నికల నియమావళి, సుప్రీంకోర్టు మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు.

ఎన్నికల పర్యవేక్షణలో ఎస్‌ఎస్‌టీ బృందాలు, ఫ్లయింగ్ స్క్వాడ్లు, రూట్ మొబైల్స్, షాడో టీమ్‌లను సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. ఈ బృందాలు క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షణ చేపడుతూ, ఎన్నికల ఉల్లంఘనలు గుర్తించిన వెంటనే స్పందించాలని తెలిపారు.

 కార్డెన్‌ అండ్‌ సెర్చ్‌ ఆపరేషన్లు విస్తృతం చేయాలి :

సమస్యాత్మక ప్రాంతాల్లో కార్డెన్‌ అండ్‌ సెర్చ్‌ ఆపరేషన్లు విస్తృతంగా నిర్వహించాలని ఎస్పీ ఆదేశించారు. నిబంధనలకు అనుగుణంగా అనుమానాస్పద వ్యక్తులు, నేరచరిత్ర కలిగినవారు, అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలన్నారు. నాకాబందీ నిర్వహిస్తూ వాహనాలను తనిఖీ చేయాలని, ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలను ముందుగానే అడ్డుకోవాలని సూచించారు.

జిల్లాలో ఆపరేషన్ త్రిశూల్‌ను పటిష్టంగా అమలు చేయాలని, గంజాయి, ఇతర మత్తుపదార్థాల అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగాన్ని అరికట్టాలని ఆదేశించారు. గంజాయి కేసుల్లో నిందితులుగా ఉన్నవారిపై నిరంతర నిఘా ఉంచాలని, పదేపదే అక్రమ రవాణా, విక్రయాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అవసరమైన సందర్భాల్లో పిట్‌ ఎన్‌డీపీఎస్‌ చట్టం కింద చర్యలకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు.

మహిళల భద్రతకు ప్రాధాన్యం :

మహిళలపై నేరాలను అరికట్టేందుకు ముందస్తు చర్యలు చేపట్టాలని, మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని ఎస్పీ తెలిపారు. మహిళలను వేధించడం, అసభ్యంగా ప్రవర్తించడం వంటి నేరాలకు పాల్పడేవారిపై కఠినంగా వ్యవహరించాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ‘శిరోరక్ష–ప్రాణరక్ష’ కార్యక్రమంలో భాగంగా హెల్మెట్ వినియోగంపై అవగాహన పెంచాలని, ట్రాఫిక్ నిబంధనల అమలుపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.

పెండింగ్ కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలి :

దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసులను సమీక్షించి, వాటి దర్యాప్తును వేగవంతం చేయాలని ఎస్పీ సూచించారు. నేరాల దర్యాప్తులో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని, పెండింగ్‌లో ఉన్న నాన్‌ బెయిలబుల్‌ వారెంట్ల అమలుపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. సంబంధిత వ్యక్తులను గుర్తించి చట్టప్రకారం చర్యలు తీసుకునేందుకు నాడ్‌గ్రిడ్‌, సీసీ కెమెరా 360 వంటి సాంకేతిక వ్యవస్థలను వినియోగించుకోవాలని ఆదేశించారు.

సోషల్ మీడియా ప్రచారంపై పర్యవేక్షణ :

ఎన్నికల సమయంలో సోషల్ మీడియాలో వ్యాపించే తప్పుడు వార్తలు, రెచ్చగొట్టే పోస్టులు, వదంతులు, విద్వేషపూరిత ప్రచారంపై నిరంతరం నిఘా ఉంచాలని ఎస్పీ సూచించారు. ప్రజల్లో భయాందోళనలు సృష్టించే లేదా వివిధ వర్గాల మధ్య ఉద్రిక్తతలకు కారణమయ్యే సమాచారాన్ని గుర్తించి సంబంధిత చట్టాల ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన ఫిర్యాదులు, సమాచారాన్ని వేగంగా స్వీకరించి స్పందించేందుకు బాపట్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక ఎలక్షన్ సెల్‌, కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ఎన్నికల నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచి ప్రక్రియ పూర్తయ్యే వరకు ప్రతి పోలీస్ అధికారి, సిబ్బంది బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని ఎస్పీ స్పష్టం చేశారు. ప్రజలు స్వేచ్ఛగా, నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకునే వాతావరణాన్ని కల్పించాలని, ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యానికి తావులేకుండా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.

సమావేశంలో చీరాల డీఎస్పీ ఎండీ మోయిన్‌, రేపల్లె డీఎస్పీ షేక్ అబ్దుల్ అజీజ్‌, జిల్లాలోని సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.

షేర్ చేయండి: 📱 WhatsApp 📘 Facebook ✖️ X