📅 డేట్ లోడింగ్... | ⏰ టైమ్ లోడింగ్...

Kaikaluru Rural Circle : ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు : కైకలూరు రూరల్‌ సీఐ వి.రవికుమార్‌

  • సుమారు 190 మంది బైండోవర్‌ ..13 లైసెన్స్‌డ్‌ ఆయుధాలు స్వాధీనం...
  • నామినేషన్లకు పరిమిత సంఖ్యలోనే అనుమతి...

ఏలూరు జిల్లా : కైకలూరు రూరల్ సర్కిల్ (క్రైమ్), స్వచ్ఛవార్త :

స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీసు శాఖ పటిష్ఠ చర్యలు చేపట్టిందని కైకలూరు రూరల్‌ సీఐ వి. రవికుమార్‌ తెలిపారు. ఎన్నికల నియమ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేయడంతోపాటు, అవసరమైతే అరెస్టులు కూడా చేస్తామని హెచ్చరించారు. జిల్లా ఎస్పీ కే.పి.ఎస్‌. కిశోర్‌ ఆదేశాలు, ఎస్‌డీపీవో శ్రవణ్‌కుమార్‌ పర్యవేక్షణలో గత నెల రోజులుగా చేపట్టిన చర్యలను, అభ్యర్థులు, రాజకీయ పార్టీలు పాటించాల్సిన నిబంధనలను మంగళవారం కైకలూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన వివరించారు.

190 మందికి బైండోవర్‌ చర్యలు :

గత ఎన్నికల కేసులతోపాటు వివిధ కేసుల్లో ఉన్నవారిని గుర్తించి బైండోవర్‌ చేసినట్లు సీఐ తెలిపారు. నాలుగు మండలాల పరిధిలో గత కేసులకు సంబంధించి 92 మందిని, సమస్యలు సృష్టించే అవకాశం ఉన్న మరో 16 మందిని బైండోవర్‌ చేశామని వివరించారు. ఇప్పటివరకు మొత్తం సుమారు 190 మందిపై ఈ చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. లైసెన్స్‌ కలిగిన 13 ఆయుధాలను ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు పోలీసు హెడ్‌క్వార్టర్స్‌లో భద్రపరిచామని పేర్కొన్నారు.

ఎన్నికల కేసులు రాజీ అయినా, కేసు నుంచి బయటపడినా గతంలో ఎన్నికల సంబంధిత కేసుల్లో ఉన్నవారిని తదుపరి ఎన్నికల సమయంలోనూ నిబంధనల ప్రకారం బైండోవర్‌ చేసే అవకాశం ఉంటుందని తెలిపారు. 30 ఏళ్ల క్రితం నమోదైన ఎన్నికల కేసుల్లో ఉన్నవారిని కూడా ప్రస్తుత ఎన్నికల నేపథ్యంలో బైండోవర్‌ చేస్తున్నట్లు చెప్పారు.

బైండోవర్‌ అంటే కేవలం తహశీల్దార్‌ ఎదుట హాజరుకావడం మాత్రమే కాదని, ఎగ్జిక్యూటివ్‌ మేజిస్ట్రేట్‌ విధించే షరతులను ఉల్లంఘిస్తే బాండ్‌ మొత్తాన్ని జప్తు చేయడంతోపాటు, ఆ మొత్తం చెల్లించలేని పరిస్థితుల్లో అరెస్టు చేసే అవకాశం ఉంటుందని వివరించారు. జిల్లాలో గతంలో బైండోవర్‌ షరతులు ఉల్లంఘించిన ఆరుగురిపై చర్యలు తీసుకుని, వారి నుంచి రూ.లక్ష చొప్పున వసూలు చేసిన సందర్భాలున్నాయని తెలిపారు.

నామినేషన్లకు పోలీసు వెరిఫికేషన్‌, ఎన్‌వోసీ :

ఎంపీటీసీ, జెడ్పీటీసీ, గ్రామపంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే అభ్యర్థులు నామినేషన్‌ ప్రక్రియలో పోలీసు వెరిఫికేషన్‌, నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌ (ఎన్‌వోసీ)కు సంబంధించిన వివరాలు సమర్పించాలని సీఐ సూచించారు. అభ్యర్థులు తమపై గతంలో నమోదైన కేసుల వివరాలను నామినేషన్‌ పత్రాల్లో తప్పనిసరిగా వెల్లడించాలని స్పష్టం చేశారు.

కైకలూరు నియోజకవర్గ పరిధిలోనే కాకుండా ఇతర ప్రాంతాల్లో, హైదరాబాద్‌, ఢిల్లీ వంటి నగరాల్లో కేసులు నమోదై ఉన్నా వాటిని దాచకుండా తెలియజేయాలని సూచించారు. అభ్యర్థులు ముందుగా పోలీసులకు సమాచారం అందిస్తే స్థానిక రికార్డులతోపాటు జిల్లా, రాష్ట్ర స్థాయి రికార్డులను పరిశీలించి వివరాలు ధ్రువీకరిస్తామని చెప్పారు.

ఈ నెల 21, 22, 23 తేదీల్లో ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు దాఖలు చేసుకోవచ్చని తెలిపారు. సంబంధిత ఎంపీడీవో కార్యాలయాల వద్ద నామినేషన్‌ ప్రక్రియ నిర్వహిస్తారని, రిటర్నింగ్‌ అధికారి ఇచ్చిన చెక్‌లిస్ట్‌ ప్రకారం అవసరమైన పత్రాలను సమర్పించాలని సూచించారు.

 నామినేషన్‌ కేంద్రానికి 100 మీటర్ల దూరంలోనే వాహనాలు :

నామినేషన్ల సందర్భంగా అభ్యర్థులు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సీఐ తెలిపారు. నామినేషన్‌ కేంద్రానికి 100 మీటర్ల దూరంలో వాహనాలను నిలిపివేయాలని, ఎంపీటీసీ అభ్యర్థి వెంట ముగ్గురు వ్యక్తులకు, గ్రామపంచాయతీ అభ్యర్థి వెంట ఇద్దరు వ్యక్తులకు మాత్రమే అనుమతి ఉంటుందని వివరించారు. అభ్యర్థితోపాటు వచ్చే వ్యక్తులు గుర్తింపు కార్డులు తీసుకురావాలని, అనుమతి లేని వారు నామినేషన్‌ కేంద్రం వైపు రావద్దని స్పష్టం చేశారు.

నామినేషన్‌ కేంద్రాల వద్ద గేటు దగ్గర తనిఖీలు, వీడియో రికార్డింగ్‌ ఉంటాయని, నామినేషన్లు స్వీకరించే రిటర్నింగ్‌ అధికారి వద్ద కూడా పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు. నిబంధనల ఉల్లంఘనలను వీడియో ఆధారాలతో గుర్తించి, అవసరమైతే తర్వాత కూడా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

నామినేషన్‌ కోసం ఊరేగింపులు, బహిరంగ సమావేశాలు నిర్వహించాలనుకునేవారు ముందుగా డీఎస్పీ అనుమతి తీసుకోవాలని సూచించారు. ర్యాలీ మార్గం, బయలుదేరే సమయం, పాల్గొనే వారి సంఖ్యను ముందుగానే తెలియజేస్తే పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తామని చెప్పారు. అనుమతి లేకుండా ఊరేగింపులు, సభలు నిర్వహిస్తే ఎన్నికల నియమావళి ఉల్లంఘనగా పరిగణిస్తామని తెలిపారు.

ప్రచారానికి 48 గంటల ముందు ఆంక్షలు :

ఎన్నికల పోలింగ్‌కు 48 గంటల ముందు నుంచి ప్రచారం నిలిపివేయాలని సీఐ తెలిపారు. ఈ సమయంలో మైకులు, ప్రచార వాహనాలు లేదా ఇతర మార్గాల్లో ప్రచారం చేయకూడదని స్పష్టం చేశారు. మద్యం  విక్రయాలపైనా నిషేధం ఉంటుందని పేర్కొన్నారు.

నామినేషన్ల పరిశీలన అనంతరం పోటీలో ఉండే అభ్యర్థులు ప్రచార వాహనాలు, మైకులు, లౌడ్‌స్పీకర్ల వినియోగానికి తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని సూచించారు. లౌడ్‌స్పీకర్లకు ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే అనుమతి ఉంటుందని తెలిపారు. రాత్రి 10 గంటల తర్వాత నిబంధనలకు విరుద్ధంగా వినియోగిస్తే సంబంధిత అభ్యర్థి, వాహన యజమాని, డ్రైవర్‌ బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.

నామినేషన్‌ రోజు నుంచి ఎన్నికలు పూర్తయ్యే వరకు పోలీసు యాక్ట్‌ సెక్షన్‌ 30 అమలులో ఉంటుందని, అనుమతి లేకుండా ర్యాలీలు, సభలు నిర్వహించడానికి వీలుండదని చెప్పారు. ఎన్నికల నియమావళి అమలును పర్యవేక్షించేందుకు స్టాటిక్‌ సర్వైలెన్స్‌ టీమ్‌ (ఎస్‌ఎస్‌టీ), ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ (ఎఫ్‌ఎస్‌టీ), మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ బృందాలు, చెక్‌పోస్టులు పనిచేస్తాయని వివరించారు.

రూ.50 వేలకుపైగా నగదు తీసుకెళ్తే ఆధారాలు తప్పనిసరి :

ఎన్నికల నేపథ్యంలో రూ.50 వేలకుపైగా నగదు తీసుకెళ్లేవారు సరైన ఆధారాలు, సంబంధిత పత్రాలు వెంట ఉంచుకోవాలని సీఐ సూచించారు. నగదు తరలింపునకు సంబంధించి అవసరమైన అనుమతులు తీసుకోవడంతోపాటు, తహశీల్దార్‌కు సమాచారం అందించి రిటర్నింగ్‌ అధికారి దృష్టికి తీసుకెళ్లాలని తెలిపారు. సరైన ఆధారాలు లేకుండా నగదు తీసుకెళ్తే ఎన్నికల నిబంధనల ప్రకారం స్వాధీనం చేసుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఎన్నికలు పూర్తయిన తర్వాత తగిన ఆధారాలు సమర్పించిన మేరకు నగదును తిరిగి పొందే అవకాశం ఉంటుందని వివరించారు.

అలాగే అనధికారికంగా మద్యం, నగదు, ఇతర వస్తువులు తరలిస్తే వాటిని స్వాధీనం చేసుకుని నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ తనిఖీలన్నీ సీసీ కెమెరాలు, వీడియో రికార్డింగ్‌ పర్యవేక్షణలో జరుగుతాయని తెలిపారు.

 పోలింగ్‌ కేంద్రాల వద్ద ప్రత్యేక నిబంధనలు :

పోలింగ్‌ రోజున కేంద్రానికి 200 మీటర్ల అవతల ఓటరు స్లిప్పులు పంపిణీ చేసే వారికి ఒక టేబుల్‌, రెండు కుర్చీలకు మాత్రమే అనుమతి ఉంటుందని సీఐ తెలిపారు. పోలింగ్‌ కేంద్రానికి 100 మీటర్ల పరిధిలో ప్రచారం చేయకూడదని, దేవాలయాలు, మసీదులు, చర్చిలు, కమ్యూనిటీ హాళ్ల వద్ద గుమిగూడి ప్రచారం నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని చెప్పారు.

ఓటు వేసేందుకు వచ్చే వారు ఎన్నికల సంఘం అనుమతించిన గుర్తింపు పత్రాలను వెంట తీసుకురావాలని సూచించారు. పోలింగ్‌ ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5 గంటలకు ముగుస్తుందని తెలిపారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించిన స్ట్రాంగ్‌ రూములు, కౌంటింగ్‌ కేంద్రాలను జిల్లా డివిజన్‌ హెడ్‌క్వార్టర్స్‌లో ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పోలింగ్‌ అనంతరం బ్యాలెట్‌ బాక్సులను ఏలూరు డివిజన్‌లోని సీఆర్‌డీ కళాశాలకు తరలించి భద్రపరుస్తామని, నవంబర్‌ 5న ఫలితాలు ప్రకటించనున్నట్లు వివరించారు.

నాలుగు మండలాల్లో పోలీసుల విస్తృత ఏర్పాట్లు :

కైకలూరు నియోజకవర్గంలోని నాలుగు మండలాల పరిధిలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు 62 సెగ్మెంట్లు, 139 పోలింగ్‌ లొకేషన్లు, 251 పోలింగ్‌ స్టేషన్లు ఉన్నాయని సీఐ తెలిపారు. వీటి పర్యవేక్షణకు సుమారు 20 రూట్‌ మొబైల్‌ బృందాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించి నాలుగు మండలాల్లో 101 గ్రామాలు, 218 పోలింగ్‌ లొకేషన్లు, 980 పోలింగ్‌ స్టేషన్లు ఉన్నట్లు వివరించారు. ఎన్నికల సమయంలో ఇతర ప్రాంతాల నుంచి బాడీబిల్డర్లు, బౌన్సర్లను తీసుకొచ్చి శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నాలు చేస్తే, వారి గత నేర చరిత్రను పరిశీలించి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

క్షణికావేశంలో గొడవలకు దిగడం, ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని సీఐ పేర్కొన్నారు. అభ్యర్థులు, రాజకీయ పార్టీల నాయకులు, ప్రజలు ఎన్నికల నియమావళిని గౌరవించి పోలీసు శాఖకు సహకరించాలని, ఎలాంటి శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు సహకరించాలని కోరారు.

షేర్ చేయండి: 📱 WhatsApp 📘 Facebook ✖️ X

Popular News From This Site

Kalidindi : కలిదిండిలో ఎన్డీఏ మండల సమావేశం.. కూటమిలోకి పలువురు వైకాపా నేతలు

Eluru : జిల్లాలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు : జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి

Mandavalli : ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి.. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే నాయకులకు అధికారుల సూచనలు

Kaikaluru : సాంకేతిక ఆధారాలతో కుట్రపూరిత నేరాన్ని ఛేదించిన కలిదిండి పోలీసులు

Kaikaluru Town : సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడితే చర్యలు తప్పవు

Kaikaluru : ప్రజలకు అందుబాటులో ఉంటూ నిబద్ధతతో పనిచేయాలి : జక్కుల విజయ్ కుమార్

Kaikaluru : వీరాబత్తిన సుధకు పలువురు టీడీపీ నేతల పరామర్శ

Mudinepalli : ముదినేపల్లి జడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థుల ప్రకటన.. జడ్పీటీసీగా బొర్రా చలమయ్య.. ఎంపీపీగా కోటప్రోలు నాగరత్నకుమారి

Gudlavalleru : శ్రీ కొండలమ్మ అమ్మవారి మహా అన్నసమారాధనకు 250 కిలోల బియ్యం విరాళం