Kaikaluru : సాంకేతిక ఆధారాలతో కుట్రపూరిత నేరాన్ని ఛేదించిన కలిదిండి పోలీసులు
- అగ్ని ప్రమాదం కేసులో ముగ్గురు నిందితులు అదుపులోకి..
- ప్రధాన నిందితుడి పాత్ర పై కొనసాగుతున్న దర్యాప్తు..
ఏలూరు జిల్లా : కైకలూరు/కలిదిండి (క్రైమ్) (స్వచ్ఛవార్త) :
మండలంలోని కోరుకొల్లు గ్రామంలో ఓ ఇంటి వద్ద జరిగిన అగ్నిప్రమాదం కేసును ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, శాస్త్రీయ దర్యాప్తుతో ఛేదించినట్లు కైకలూరు రూరల్ సీఐ వి. రవికుమార్ తెలిపారు. ఈ కేసులో A2, A3, A4 నిందితులను అదుపులోకి తీసుకున్నామని, A1 పాత్రపై దర్యాప్తు కొనసాగుతోందని ఆయన పేర్కొన్నారు. మంగళవారం కైకలూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ కేసు వివరాలను సీఐ వెల్లడించారు.
కలిదిండి పోలీస్‌స్టేషన్ పరిధిలోని కోరుకొల్లు గ్రామానికి చెందిన చందన ఉమా మహేశ్వరరావు ఇంటి వద్ద అక్టోబర్ 1, 2 తేదీల మధ్య అర్ధరాత్రి సుమారు 1.30 గంటలకు అగ్నిప్రమాదం జరిగిందని సీఐ తెలిపారు. ఈ ఘటనపై బాధితుడు అక్టోబర్ 3న ఇచ్చిన ఫిర్యాదు మేరకు క్రైమ్ నంబర్ 149/2026గా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వివరించారు. బాధితుడికి A1తో ఉన్న ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన మనస్పర్థల నేపథ్యంలో ఈ ఘటన జరిగి ఉండవచ్చని ఫిర్యాదులో అనుమానం వ్యక్తం చేసినట్లు చెప్పారు.
జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, డీఎస్పీ పర్యవేక్షణలో తన సూచనలతో కలిదిండి ఎస్ఐ దర్యాప్తు చేపట్టారని సీఐ తెలిపారు. ఘటనాస్థలంలో ఏపీఎఫ్ఎస్ఎల్, క్లూస్ టీమ్, వేలిముద్రల నిపుణుల బృందాలతో శాస్త్రీయ ఆధారాలు సేకరించినట్లు పేర్కొన్నారు. బాధితుడి ఇంటి సీసీ కెమెరాల ఫుటేజీతోపాటు, జిల్లా పోలీస్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా అందుబాటులో ఉన్న కెమెరాల దృశ్యాలను విశ్లేషించి అనుమానితుల కదలికలను గుర్తించినట్లు వివరించారు.
ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో కుట్ర :
దర్యాప్తులో A2కు A1 కుటుంబంతో గతంలో పరిచయం ఉన్నట్లు వెల్లడైందని సీఐ తెలిపారు. ఈ పరిచయం ద్వారా A1 పలుమార్లు A2కు ఆర్థిక సహాయం చేయడంతోపాటు, అతని సోదరికి విజయవాడలో ఉద్యోగం ఇప్పించినట్లు విచారణలో తెలిసిందన్నారు. ఫిర్యాదిదారుడితో ఉన్న ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన పత్రాల పంపిణీ కోసం A2ను ఉపయోగించుకున్నట్లు, ఉద్యోగం ఇప్పిస్తానని, నేరంలో పాల్గొంటే రూ.20 వేలు ఇస్తానని ఆశ చూపినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైందని పేర్కొన్నారు.
నేరానికి ముందు బాధితుడి ఇంటి వద్ద రెక్కీ నిర్వహించడం, ముఖాలు గుర్తుపట్టకుండా మంకీ క్యాపులు కొనుగోలు చేయడం, మొబైల్ ఫోన్లను ఇళ్ల వద్ద ఉంచడం, ప్లాస్టిక్ బాటిల్లో పెట్రోల్ తీసుకెళ్లడం, స్కూటీ నంబర్ ప్లేట్‌పై స్టిక్కర్లు అంటించడం వంటి చర్యలకు నిందితులు పాల్పడినట్లు దర్యాప్తులో గుర్తించామని సీఐ వివరించారు. కైకలూరు మార్గానికి బదులుగా మండవల్లి, ముదినేపల్లి, సింగరాయపాలెం మీదుగా కోరుకొల్లు చేరుకున్నట్లు ప్రాథమిక ఆధారాలు సూచిస్తున్నాయని తెలిపారు.
సాంకేతిక ఆధారాలు, సీసీ కెమెరాల ఫుటేజీ విశ్లేషణ, శాస్త్రీయ ఆధారాల సేకరణ, క్షేత్రస్థాయి విచారణల సమన్వయంతో A2, A3, A4లను గుర్తించి అదుపులోకి తీసుకున్నామని సీఐ తెలిపారు. వారిని న్యాయస్థానం ఎదుట హాజరుపరిచేందుకు చట్టపరమైన చర్యలు చేపట్టినట్లు, A1 పాత్రపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు వెల్లడించారు.
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, శాస్త్రీయ దర్యాప్తు, సమన్వయంతో నేరాలను ఛేదించేందుకు ఏలూరు జిల్లా పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారని కైకలూరు రూరల్ సీఐ వి. రవికుమార్ వెల్లడించారు.
