Kaikaluru Town : సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడితే చర్యలు తప్పవు
- స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కైకలూరు టౌన్ ఇన్‌స్పెక్టర్ ఏవీఎస్ రామకృష్ణ హెచ్చరిక
ఏలూరు జిల్లా : కైకలూరు టౌన్ (క్రైమ్) స్వచ్ఛవార్త :
సోషల్ మీడియాను సమాచార మార్పిడికి, మంచి విషయాల ప్రచారానికి మాత్రమే ఉపయోగించుకోవాలని, వ్యక్తిగత దూషణలు, అసత్య ప్రచారాలు, విద్వేషపూరిత పోస్టులు పెడితే చట్టపరమైన చర్యలు తప్పవని కైకలూరు టౌన్ ఇన్‌స్పెక్టర్ ఏవీఎస్ రామకృష్ణ హెచ్చరించారు. శుక్రవారం సాయంత్రం తన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ రామకృష్ణ మాట్లాడుతూ..
సోషల్ మీడియా వేదికగా ఇతరులను కించపరిచేలా, పరువుకు భంగం కలిగించేలా పోస్టులు పెట్టడం, వాటిని షేర్ చేయడం చట్టరీత్యా నేరమని స్పష్టం చేశారు. సామాజిక మాధ్యమాల ద్వారా సమాచారాన్ని వేగంగా ప్రజలకు చేరవేసే అవకాశం ఉన్నప్పటికీ, కొందరు వ్యక్తులు ఈ వేదికలను దుర్వినియోగం చేస్తూ తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. అసభ్య పదజాలంతో పోస్టులు పెట్టడం, వ్యక్తులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం, సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నాలకు పాల్పడటం వంటి చర్యలను ఉపేక్షించబోమని హెచ్చరించారు. చట్టాలపై అవగాహన లేదని, పొరపాటున పోస్టు చేశామని చెప్పడం చట్టపరమైన బాధ్యత నుంచి తప్పించుకునేందుకు కారణం కాదన్నారు.
గ్రూప్ అడ్మిన్లు బాధ్యతగా వ్యవహరించాలి :
వాట్సాప్‌తో పాటు ఇతర సామాజిక మాధ్యమాల గ్రూపుల అడ్మిన్లు తమ గ్రూపుల్లో వచ్చే పోస్టులపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎవరైనా వ్యక్తిగత దూషణలు, అసభ్యకరమైన లేదా విద్వేషపూరిత పోస్టులు పెడితే వెంటనే వాటిని తొలగించాలని, అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. గ్రూపుల్లో జరిగే అక్రమ ప్రచారాన్ని నిర్లక్ష్యం చేస్తే అడ్మిన్ల బాధ్యతను కూడా పరిశీలించి చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఫేక్ ఐడీలు, ఇతరుల సిమ్‌కార్డులతో పోస్టులు పెట్టినా చర్యలు :
నకిలీ సోషల్ మీడియా ఖాతాలు, ఇతరుల పేర్లపై ఉన్న సిమ్‌కార్డులను ఉపయోగించి అసభ్యకరమైన పోస్టులు పెడుతున్న వారిని గుర్తిస్తున్నట్లు తెలిపారు. తమ పేరుతో ఉన్న సిమ్‌కార్డులను ఇతరులకు ఇచ్చే విషయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. వ్యక్తిగత విభేదాలను సోషల్ మీడియాలోకి తీసుకురావడం, ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకోవడం, గ్రూపుల మధ్య వివాదాలు సృష్టించడం వంటి చర్యలకు పాల్పడితే కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు.
ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు :
స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (ఎన్నికల ప్రవర్తనా నియమావళి) వర్తిస్తుందని రామకృష్ణ తెలిపారు. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలకు అనుకూలంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం, అనుమతులు లేని ఫ్లెక్సీలను బహిరంగ ప్రదేశాల్లో, విద్యుత్ స్తంభాలు, టెలిఫోన్ స్తంభాలపై, ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఏర్పాటు చేయడం నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తుందని వివరించారు. ఇలాంటి చర్యలకు సంబంధించి ఎన్నికల నియమావళితో పాటు వర్తించే చట్టాల ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని హెచ్చరించారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేసినా, ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా పోస్టులు పెట్టినా ఉపేక్షించబోమని స్పష్టం చేశారు.
ప్రజలు సామాజిక మాధ్యమాలను మంచి విషయాల ప్రచారానికి, సమాచార మార్పిడికి మాత్రమే ఉపయోగించుకోవాలని, ఇతరులను కించపరిచే పోస్టులు, విద్వేషపూరిత ప్రచారాలు, అనధికార ఫ్లెక్సీల ఏర్పాటుకు దూరంగా ఉండాలని ఇన్‌స్పెక్టర్ ఏవీఎస్ రామకృష్ణ విజ్ఞప్తి చేశారు.
