Amalapuram : ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ఆర్‌టీసీ బస్సు సౌకర్యం ప్రారంభం.. విద్యార్థుల హర్షం
తూ.గో జిల్లా : అమలాపురం : పేరూరు : స్వచ్ఛవార్త :
అమలాపురం సమీపంలోని పేరూరు లో నూతనంగా ప్రారంభించబడిన ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు విద్యార్థుల సౌకర్యార్థం అమలాపురం ఆర్‌టీసీ అధికారులు ప్రత్యేక బస్సు సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారని కళాశాల ప్రిన్సిపాల్ డా. విన్నా నరసింహ స్వామి తెలిపారు.
ఉదయం అయినవిల్లి మండలంలోని విరవల్లిపాలెం, ఎస్. యానాం, ఆదుర్రు ప్రాంతాల నుండి ఆర్‌టీసీ బస్సులు బయలుదేరి నేరుగా కళాశాలకు చేరుకుంటాయని ఆయన వివరించారు. ఈ సౌకర్యాన్ని ఆయా ప్రాంతాల విద్యార్థినీ, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
అదేవిధంగా రాజోలు నుండి అమలాపురం వెళ్లే మరియు అమలాపురం నుండి రాజోలు వచ్చే ఆర్‌టీసీ బస్సులు పేరూరులో ఆగేందుకు కూడా ఆర్‌టీసీ అధికారులు అనుమతి ఇచ్చారని ప్రిన్సిపాల్ తెలిపారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలపై కొన్ని ప్రైవేట్ కళాశాలలు అసత్య ప్రచారం చేస్తున్నట్లు విద్యార్థుల తల్లిదండ్రుల ద్వారా తమ దృష్టికి వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. కళాశాల ఎక్కడికీ తరలించబడదని, ప్రభుత్వ జి.ఓ. నెం. 64 ప్రకారం పేరూరులోనే శాశ్వతంగా స్థాపించబడిందని స్పష్టం చేశారు.
ప్రభుత్వ కళాశాలలో ఫీజులు చాలా తక్కువగా ఉండటంతో పాటు, ముఖ్యంగా ఈ ప్రాంతంలోని ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థినీ, విద్యార్థులకు ఉన్నత మరియు నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ కళాశాలను ఏర్పాటు చేసిందన్నారు. అవసరమైన సౌకర్యాలన్నీ దశలవారీగా కళాశాలకు కల్పించబడుతున్నాయని, ఈ విషయాన్ని తల్లిదండ్రులు గమనించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా స్థానిక శాసనసభ్యులు అయితాబత్తుల ఆనందరావు, అమలాపురం ఆర్‌టీసీ మేనేజర్, ఆర్‌టీసీ అధికారులకు మరియు సిబ్బందికి ప్రిన్సిపాల్ డా. విన్నా నరసింహ స్వామి, కళాశాల విద్యార్థులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
