Amaravati : అగ్నికుల క్షత్రియ సమాజానికి చారిత్రక గౌరవం.. ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు
అమరావతి / కలిదిండి : స్వచ్ఛవార్త :
పొన్నమండ లక్ష్మణస్వామి వర్మ జయంతిని ప్రతి సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వ అధికారిక వేడుక (స్టేట్ ఫంక్షన్)గా నిర్వహిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేయడంపై అగ్నికుల క్షత్రియ సమాజంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సందర్భంగా అమరావతి వెలగపూడి సచివాలయంలో బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అగ్నికుల క్షత్రియ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా కార్పొరేషన్ డైరెక్టర్ ఆండ్రాజు శ్రీనివాసరావు మాట్లాడుతూ..
అగ్నికుల క్షత్రియ సమాజం ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న చిరకాల వాంఛను నెరవేర్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి సమాజం తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. పొన్నమండ లక్ష్మణస్వామి వర్మ జయంతిని ప్రభుత్వ అధికారిక కార్యక్రమంగా గుర్తించడం ద్వారా అగ్నికుల క్షత్రియుల చరిత్ర, సేవలకు తగిన గౌరవం దక్కిందన్నారు. ఈ నిర్ణయం సమాజ ఆత్మగౌరవాన్ని మరింత పెంచడమే కాకుండా భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని పేర్కొన్నారు.
కార్పొరేషన్ చైర్మన్ చిలకలపూడి పాపారావు, డైరెక్టర్లు ఆండ్రాజు శ్రీనివాసరావు, బొమ్మిడి రామకృష్ణ, పితా గోపీచంద్ ముఖ్యమంత్రిని కలిసి శుభాకాంక్షలు తెలియజేస్తూ కృతజ్ఞతలు వ్యక్తం చేశారు. అగ్నికుల క్షత్రియ సమాజ అభ్యున్నతికి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు చారిత్రకమైనవని వారు పేర్కొన్నారు.
పొన్నమండ లక్ష్మణస్వామి వర్మ సేవలను భావితరాలకు పరిచయం చేసే దిశగా ఈ నిర్ణయం కీలక మైలురాయిగా నిలుస్తుందని, అగ్నికుల క్షత్రియ సమాజం తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నట్లు ఆండ్రాజు శ్రీనివాసరావు అన్నారు. సమాజ సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహానికి అగ్నికుల క్షత్రియులు ఎల్లప్పుడూ రుణపడి ఉంటారని పేర్కొన్నారు.
