రాధా-రంగా ఆశయాల సాధనకు కట్టుబడి పనిచేస్తాం : కాళ్లపాలెం బుజ్జి
తూర్పుగోదావరి జిల్లా : స్వచ్ఛవార్త :
తూర్పుగోదావరి జిల్లా దొమ్మేరు గ్రామంలో ఆంధ్ర-తెలంగాణ రాధా రంగా మిత్రమండలి చారిటబుల్ ట్రస్ట్ ఐదవ వార్షికోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వంగవీటి మోహనరంగా మనవడు జూనియర్ మోహన్ రంగా హాజరై రక్తదానం చేశారు.
ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడు పన్నాస పూర్ణచంద్రరావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడు బుజ్జి తో పాటు పలువురు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత ఐదేళ్లుగా రాజకీయ, కుల, మత భేదాలకు అతీతంగా ట్రస్ట్ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజలకు అండగా నిలుస్తోందన్నారు.
సమాజ సేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ట్రస్ట్ ద్వారా రక్తదాన శిబిరాలు, పేదలకు సహాయ కార్యక్రమాలు, యువతలో సేవా దృక్పథాన్ని పెంపొందించే కార్యక్రమాలు నిరంతరం నిర్వహిస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులో కూడా రాధా-రంగా ఆశయాల సాధన కోసం మరింత ఉత్సాహంతో సేవా కార్యక్రమాలను విస్తరించనున్నట్లు పేర్కొన్నారు.
తూర్పుగోదావరి జిల్లా ట్రస్ట్ యూత్ అధ్యక్షుడు కొమ్మాన మాణిబాబు ఆధ్వర్యంలో సుమారు 40 మంది రంగా అభిమానులు, ట్రస్ట్ సభ్యులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. రక్తదానం ద్వారా ప్రాణాలను కాపాడే మహోన్నత సేవలో యువత భాగస్వాములు కావడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. అనంతరం ట్రస్ట్ ఐదు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కేక్ కత్తిరించి శుభాకాంక్షలు తెలిపారు.
కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు రవి, ఉమ్మడి జిల్లాల మహిళా అధ్యక్షురాలు కృష్ణప్రియ, తూర్పుగోదావరి జిల్లా మహిళా అధ్యక్షురాలు రామలక్ష్మి, ఆకుల నాగన్న, రవిబాబు, సతీష్, యాసం చీటిబాబు, గుడివాక శివరాం, వీరబాబు, మండపేట పార్వతి, సూర్య, నరేంద్ర, సుధాకర్, దాసు, శ్రీహరి, సింగబాబు, బాబీ తదితరులు పాల్గొన్నారు.


