పుట్టిన ప్రతి శిశువుకు హెపటైటిస్-బి వ్యాక్సిన్ తప్పనిసరిగా వేయించాలి : డా. రామకృష్ణ
కాలేయానికి ముప్పు తెచ్చే హెపటైటిస్.. ముందస్తు జాగ్రత్తలే మహా రక్ష..!
ప్రపంచ హెపటైటిస్ దినోత్సవం సందర్భంగా ప్రజల్లో అవగాహన పెరగాల్సిన అవసరం..
కాకినాడ జిల్లా : కాకినాడ : స్వచ్ఛ వార్త :
వ్యాక్సినేషన్, సకాలంలో పరీక్షలు, జీవనశైలిలో చిన్న మార్పులతో హెపటైటిస్‌ను నివారించొచ్చని కిమ్స్ ట్రస్ట్ హాస్పిటల్ చీఫ్ ఇంటెన్సివిస్ట్ అండ్ క్రిటికల్ కేర్ ఫిజిషియన్, (IMA) కాకినాడ శాఖ కార్యదర్శి డాక్టర్ ఎస్.సి.హెచ్.ఎస్. రామకృష్ణ సూచనలు చేశారు.
ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాది లక్షలాది మంది ప్రాణాలను బలిగొంటున్న కాలేయ సంబంధిత వ్యాధి హెపటైటిస్పై ప్రజల్లో అవగాహన పెంపొందించడం అత్యవసరమని కిమ్స్ ట్రస్ట్ హాస్పిటల్ చీఫ్ ఇంటెన్సివిస్ట్ అండ్ క్రిటికల్ కేర్ ఫిజిషియన్, ఐఎంఏ (IMA) కాకినాడ శాఖ కార్యదర్శి డాక్టర్ ఎస్.సి.హెచ్.ఎస్. రామకృష్ణ అన్నారు. ప్రపంచ హెపటైటిస్ దినోత్సవాన్ని పరస్కరించుకుని హెపటైటిస్ వ్యాధి తీవ్రత, వ్యాప్తి, నివారణ చర్యలు, ఆధునిక చికిత్సలపై ఆయన ప్రజలకు విలువైన సూచనలు చేశారు.
ఈ ఏడాది ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) "Hepatitis: Let's Break It Down" అనే అంశంతో ప్రపంచ హెపటైటిస్ దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. హెపటైటిస్-బి వైరస్‌ను కనుగొని, దానిపై పరిశోధనలు చేసి ప్రపంచానికి వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన నోబెల్ బహుమతి గ్రహీత డాక్టర్ బారూచ్ బ్లంబర్గ్ జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రతి ఏడాది జూలై 28న ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.
కాలేయం ఆరోగ్యంగా ఉంటేనే శరీరం సురక్షితం :
మానవ శరీరంలో కాలేయం అత్యంత కీలకమైన అవయవం.మనం తీసుకునే ఆహారాన్ని శరీరానికి అవసరమైన శక్తిగా మార్చడం, విషపదార్థాలను తొలగించడం, రక్తాన్ని శుద్ధి చేయడం, శరీర జీవక్రియలను సమతుల్యం చేయడం వంటి ఎన్నో బాధ్యతలను కాలేయం నిర్వహిస్తుంది. అలాంటి కాలేయంపై హెపటైటిస్ వైరస్ దాడి చేసినప్పుడు క్రమంగా అది దెబ్బతింటూ ప్రాణాంతక పరిస్థితులకు దారి తీస్తుంది.
హెపటైటిస్ వ్యాధి ప్రారంభ దశలో పెద్దగా లక్షణాలు కనిపించకపోవడం వల్ల చాలామంది నిర్లక్ష్యం చేస్తుంటారు. వ్యాధి ముదిరిన తర్వాత మాత్రమే లివర్ సిరోసిస్, లివర్ ఫెయిల్యూర్ లేదా లివర్ క్యాన్సర్ వంటి సమస్యలు బయటపడతాయి. అందుకే హెపటైటిస్‌ను వైద్యులు "సైలెంట్ కిల్లర్" (నిశ్శబ్ద హంతకుడు)గా పేర్కొంటారని డాక్టర్ రామకృష్ణ వివరించారు.
హెపటైటిస్ వైరస్‌లు ఐదు రకాలు...
హెపటైటిస్‌కు కారణమయ్యే వైరస్‌లు ప్రధానంగా A, B, C, D, E అనే ఐదు రకాలుగా ఉంటాయి.
హెపటైటిస్-A, E
ఈ వైరస్‌లు ప్రధానంగా కలుషితమైన నీరు, పరిశుభ్రత లేని ఆహారం ద్వారా వ్యాపిస్తాయి. రోడ్డు పక్కన విక్రయించే అపరిశుభ్రమైన ఆహారం తీసుకోవడం, శుద్ధి చేయని నీరు తాగడం వల్ల ఇవి ఎక్కువగా సోకుతాయి. సకాలంలో గుర్తించి సరైన చికిత్స తీసుకుంటే పూర్తిగా కోలుకునే అవకాశం ఉంటుంది.
హెపటైటిస్-B, C, D
ఈ వైరస్‌లు అత్యంత ప్రమాదకరమైనవి. కలుషితమైన రక్తం ఎక్కించడం, ఇతరులు ఉపయోగించిన ఇంజెక్షన్ సూదులను మళ్లీ వినియోగించడం, సెలూన్లలో ఒకే బ్లేడ్‌ను పలువురికి ఉపయోగించడం, సురక్షితం కాని లైంగిక సంబంధాల ద్వారా ఈ వైరస్‌లు వ్యాపిస్తాయి. గర్భిణికి వైరస్ ఉంటే పుట్టబోయే శిశువుకూ సంక్రమించే ప్రమాదం ఉందని డాక్టర్ రామకృష్ణ తెలిపారు.
ఈ జాగ్రత్తలు పాటిస్తే హెపటైటిస్‌కు దూరంగా ఉండొచ్చు...
హెపటైటిస్‌ను నివారించేందుకు ప్రతి ఒక్కరూ ఈ సూచనలు పాటించాలని డాక్టర్ రామకృష్ణ సూచించారు.
- పుట్టిన ప్రతి శిశువుకు హెపటైటిస్-బి వ్యాక్సిన్ తప్పనిసరిగా వేయించాలి.
- వ్యాక్సిన్ తీసుకోని పెద్దలు మూడు డోసుల వ్యాక్సిన్ పూర్తి చేసుకోవాలి.
- రక్తం ఎక్కించాల్సి వస్తే గుర్తింపు పొందిన బ్లడ్ బ్యాంక్ నుంచి పరీక్షించిన రక్తాన్నే వినియోగించాలి.
- ఇంజెక్షన్లకు ఎల్లప్పుడూ కొత్త డిస్పోజబుల్ సూదులనే ఉపయోగించాలి.
- సెలూన్లు, బ్యూటీ పార్లర్లలో ప్రతిసారి కొత్త బ్లేడ్ వినియోగిస్తున్నారా లేదా గమనించాలి.
- ఇతరుల రేజర్లు, టూత్ బ్రష్‌లు వంటి వ్యక్తిగత వస్తువులు ఎప్పుడూ ఉపయోగించకూడదు.
- మద్యపానానికి దూరంగా ఉండాలి. ఆల్కహాల్ వల్ల కాలేయం వేగంగా దెబ్బతింటుందని ఆయన హెచ్చరించారు.
- ప్రతి ఒక్కరూ కనీసం ఏడాదికి ఒకసారి లివర్ ఫంక్షన్ టెస్ట్ (LFT) తో పాటు హెపటైటిస్ స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలి.
హెపటైటిస్-సికి సమర్థవంతమైన చికిత్స అందుబాటులో...
హెపటైటిస్-సిని ప్రారంభ దశలోనే గుర్తిస్తే ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆధునిక మందులతో పూర్తిగా నయం చేసే అవకాశం ఉందని డాక్టర్ రామకృష్ణ తెలిపారు. అందుకే లక్షణాలు కనిపించే వరకు వేచి ఉండకుండా ముందస్తు పరీక్షలు చేయించుకోవడం ఎంతో అవసరమన్నారు.
అవగాహనే అతిపెద్ద ఆయుధం :
వ్యాధి ముదిరిన తర్వాత చికిత్స కోసం పరుగులు తీయడం కంటే, ముందస్తు అవగాహన, వ్యాక్సినేషన్, క్రమం తప్పని ఆరోగ్య పరీక్షలే హెపటైటిస్‌ను అడ్డుకునే అత్యంత సమర్థవంతమైన మార్గాలని డాక్టర్ రామకృష్ణ పేర్కొన్నారు.
"మన కుటుంబంలోని ప్రతి ఒక్కరికీ హెపటైటిస్-బి వ్యాక్సినేషన్ పూర్తయిందో లేదో ఒకసారి పరిశీలించాలి. పరిశుభ్రత పాటించడం, సురక్షిత వైద్య విధానాలను అనుసరించడం, సమయానికి పరీక్షలు చేయించుకోవడం ద్వారా ఈ నిశ్శబ్ద హంతకుడిని సమాజం నుంచి తరిమికొట్టవచ్చు" అని ఆయన పిలుపునిచ్చారు.
ప్రపంచ హెపటైటిస్ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ కాలేయ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకుని హెపటైటిస్ రహిత సమాజ నిర్మాణానికి భాగస్వాములు కావాలని డాక్టర్ ఎస్.సి.హెచ్.ఎస్. రామకృష్ణ విజ్ఞప్తి చేశారు.
