Dwarakatirumala : చిన్న వెంకన్న ఆలయంలో భక్తుడి నగదు చోరీ.. కేసును చేదించిన ద్వారకాతిరుమల ఎస్సై సుధీర్.. రూ.80వేలు స్వాధీనం
ఏలూరు జిల్లా : ద్వారకాతిరుమల క్రైమ్ : స్వచ్ఛవార్త :
ద్వారకాతిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో భక్తుడి వద్ద రూ. లక్ష నగదు చోరీ చేసిన కేసును పోలీసులు వేగంగా ఛేదించారు. సీసీ కెమెరాల ఫుటేజ్, సాంకేతిక ఆధారాలతో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి రూ.80 వేల నగదు, నేరానికి ఉపయోగించిన ఆటోను స్వాధీనం చేసుకున్నారు.తొలి ఏకాదశి సందర్భంగా దర్శనానికి వచ్చిన ఏలూరు మండలం సుంకరివారి తోటకు చెందిన గూరుగుబెల్లి రమణమూర్తి వద్ద నుంచి రూ. లక్ష నగదు అపహరణకు గురైంది. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివకిషోర్ ఆదేశాల మేరకు దర్యాప్తు చేపట్టి నిందితులను గుర్తించారు. పరారీలో ఉన్న మరో నిందితుడిని త్వరలో అరెస్ట్ చేసి మిగిలిన రూ.20 వేల నగదును కూడా రికవరీ చేస్తామని ఎస్‌ఐ టి. సుధీర్ తెలిపారు. కేసును ఛేదించిన పోలీసు బృందాన్ని ఉన్నతాధికారులు అభినందించారు. భక్తులు రద్దీ ప్రాంతాల్లో నగదు, విలువైన వస్తువుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.
