ఆదివాసి హక్కుల పరిరక్షణ కోసం ఐ.టి.డి.ఏ ముట్టడి
ఏలూరు జిల్లా : బుట్టాయగూడెం : స్వచ్ఛవార్త :
ఏజెన్సీ ప్రాంతంలో ప్రజల సమస్యలను పరిష్కరించాలని, 1/70 చట్టం పటిష్టంగా అమలు చేయాలని, జీవో నెంబర్ 3, తరహా జీవోకు ముఖ్యమంత్రి హామీను వెంటనే అమలు చేయాలని సిపిఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ పార్టీ డిమాండ్ చేసింది. ఈ మేరకు సోమవారం కోట రామచంద్రపురం ఐ టి డి ఏ వద్ద సిపిఐ ఎం.ఎల్. న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ , అనంతరం ఐటిడిఏ ముట్టడి నిర్వహించారు.
అఖిలభారత రైతు కూలి సంఘం ( ఏ ఐ కె ఎమ్ ఎస్) జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పి.శ్రీనివాస్, కె.రాఘవ లు మాట్లాడుతూ... జిల్లాలో ఏజెన్సీ ప్రాంతాన్ని తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారని, ఆదివాసి చట్టాలను హక్కులను కాల రాస్తున్నారని అన్నారు. 1/70 చట్టం, పిసా చట్టం అమలు విషయంలో ప్రభుత్వ యంత్రాంగం మీనమేషాలు లెక్కిస్తునారని విమర్శించారు. ఏజెన్సీ ప్రాంతంలో విద్యా వైద్యం అభివృద్ధి పట్టించుకోవడంలేదని ధ్వజమెత్తారు. బుట్టాయగూడెం సామాజిక ఆసుపత్రిలో డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల చనిపోయిన మోతుగూడెం విద్యార్థిని మృతి సంఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
గిరిజన విద్యార్థులు చదువుకుంటున్న గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలలను , యూపీ స్కూల్ గా మార్చడాన్ని తీవ్రంగా ఖండించారు. ఆదివాసి గిరిజన విద్యార్థులు చదువుకుంటున్న లంక పాకల, పులి రామన్నగూడెం, రెడ్డి కోపల్లి, ఇటికలకోట పాఠశాలలను ఉన్నత పాఠశాలలుగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఏజెన్సీ ఐదవ షెడ్యూల్ ప్రాంతంలో ఆదివాసి చట్టాలు పటిష్టంగా అమలు చేస్తూ గిరిజన ప్రజలకు న్యాయం చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అన్నారు.
ఈ ముట్టడి కార్యక్రమంలో అఖిలభారత ఆదివాసి వేదిక ( ఏ ఐ టీ ఎఫ్) జాతీయ కన్వీనర్ ఎస్ రామ్మోహన్, తగరం బాబురావు, పి వో డబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు వెట్టి భారతి, న్యాయవాది యు ఏసుబాబు ,పి డి ఎస్ యూ జిల్లా ప్రధాన కార్యదర్శి, బన్నీ వినోద్, ఏ ఐ కే ఎం ఎస్ జిల్లా సహాయ కార్యదర్శి ఈ. భూషణంలు మాట్లాడుతూ... 1/70 చట్టం రద్దు చేయించడం కోసం సుప్రీంకోర్టులో గిరిజనేతరులు పిటిషన్ వేసారని ఇది చాలా దుర్మార్గమైన చర్య అని అన్నారు.
ఆదివాసి జాతిని, ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్న ఖనిజ సంపదలను, భూములను లాక్కోవడం కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని వారు అన్నారు. గిరిజన చట్టాల పరిరక్షణ కోసం పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని అన్నారు. ముందుగా సాయిబాబా గుడి దగ్గర నుండి ఆదివాసి ప్రజలతో భారీ ర్యాలీ ప్రారంభమై ఐటిడిఏ కార్యాలయానికి చేరుకొని కార్యాలయం ముట్టడి నిర్వహించారు.
కార్యక్రమంలో ఏ ఐ కే ఎం ఎస్ నాయకులు కన్నారావు, కొండలరావు, వి సద్గురు, ముక్కారెడ్డి, సోమరాజు, భీమరాజు, పి ఓ డబ్ల్యు నాయకులు జిల్లా కార్యదర్శి కురసం లత, శాంతి, కారం అరుణ, పి వై ఎల్ నాయకులు గురుగుంట్ల ప్రసాద్, లక్ష్మీనారాయణ, రాజు, మాజీ సర్పంచులు మడి శ్రీరాములు, ముక్కారెడ్డి, , మాజీ ఎంపీటీసీ కొవ్వాసు గోవిందరాజు, తదితరులు నాయకత్వం వాయించారు. ఆదివాసి గిరిజన ప్రజలు నలుమూలల నుండి పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
