Buttayagudem : హక్కుల పరిరక్షణ కొరకై ఆదివాసీల గర్జన
ఏలూరు జిల్లా : బుట్టాయగూడెం : స్వచ్ఛవార్త :
హక్కుల పరిరక్షణ కోసం ఆదివాసీల గర్జనతో కోట రామచంద్రపురం, ఐటిడిఎ దద్దరిల్లింది. 1/70 చట్టం అమలు, ఆదివాసీల హక్కుల పరిరక్షణ, జీవో నెం.3 పునరుద్ధరణ, తదితర డిమాండ్లతో బుధవారం వివిధ గిరిజన సంఘాల ఆధ్వర్యంలో కోట రామచంద్రపురం ఐటిడిఎ వద్ద ఆదివాసి గర్జన పేరుతో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఆదివాసి గర్జన ర్యాలీకి ఆదివాసులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ర్యాలీ సందర్భంగా “జీవో నెం.3 అమలు చేయాలి”, “1/70 చట్టాన్ని పరిరక్షించాలి”, “ఆదివాసుల హక్కులను కాపాడాలి” అంటూ నినాదాలతో ఐటీడీఏ ప్రాంగణం మార్మోగింది.
ఈ కార్యక్రమంలో ఆదివాసి గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎ.అశోక్, ఆదివాసి గిరిజన సమైక్య రాష్ట్ర అధ్యక్షుడు కారం ధారయ్య, జీఎస్పీ జిల్లా నాయకుడు రమేష్, ఆదివాసి సంక్షేమ పరిషత్ నాయకులు ముక్కయ్య, ఆదివాసి గిరిజన సంఘం జిల్లా అధ్యక్ష–కార్యదర్శులు తెల్లం రామకృష్ణ, ధర్ముల రమేష్, జాతీయ ఆదివాసి పాస్టర్ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు ఫిలిప్స్, గిరిజన నాయకురాలు మొడియం నాగమణి, తదితరులు మాట్లాడుతూ, గిరిజనుల రాజ్యాంగబద్ధ హక్కులను ప్రభుత్వం పరిరక్షించాలని, జీవో నెం.3ను వెంటనే అమలు చేయడంతో పాటు 1/70 చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఆలస్యం చేయకుండా స్పష్టమైన ప్రకటన చేయాలని కోరారు.
ఈ సందర్భంగా నాయకులు అధికారులను హెచ్చరిస్తూ, ఆగస్టు 9వ తేదీ లోపు జీవో నెం.3 పై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ప్రకటించారు. ఆదివాసుల హక్కుల సాధన వరకు పోరాటం నిరంతరం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
కార్యక్రమంలో ఆదివాసి గిరిజన సంఘం నాయకులు కారం భాస్కరరావు, పోలోజు నాగేశ్వరరావు, కారం ముత్యాలరావు తదితరులు పాల్గొన్నారు.
