Chintalapudi : వ్యాక్సిన్లు భవిష్యత్ ఆరోగ్య భద్రతకు రక్షణ కవచం : ఎమ్మెల్యే రోషన్ కుమార్
ఏలూరు జిల్లా : చింతలపూడి : స్వచ్ఛవార్త :
స్థానిక బాలికల ఉన్నత పాఠశాలలో బుధవారం నిర్వహించిన ప్రత్యేక పాఠశాల టీకా కార్యక్రమంలో చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ పాల్గొన్నారు. విద్యార్థులకు అందిస్తున్న టీకా కార్యక్రమాన్ని ఆయన పరిశీలించి, ఆరోగ్య సిబ్బందితో మాట్లాడారు.
ఈ సందర్భంగా ఐదేళ్ల వయస్సు గల చిన్నారులకు డీపీటీ (DPT) టీకా, 10 మరియు 16 సంవత్సరాల వయస్సు గల విద్యార్థులకు టీడీ (Td) టీకాలను అందించారు. టీకాల ద్వారా పిల్లలను పలు వ్యాధుల నుంచి రక్షించవచ్చని వైద్య సిబ్బంది వివరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోషన్ కుమార్ మాట్లాడుతూ..
వ్యాక్సిన్లు పిల్లల ఆరోగ్య రక్షణలో కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. భవిష్యత్ ఆరోగ్య భద్రత కోసం ప్రతి చిన్నారికి ప్రభుత్వం సూచించిన టీకాలు తప్పనిసరిగా వేయించాలని సూచించారు. తల్లిదండ్రులు కూడా ఈ విషయంలో చైతన్యంతో వ్యవహరించి పిల్లలకు సకాలంలో టీకాలు వేయించేందుకు సహకరించాలని కోరారు.
ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి టీకాలు అత్యంత అవసరమని, ప్రభుత్వం చేపడుతున్న ఆరోగ్య కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ అఫ్రిన్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాటూరి చక్రధరరావు, ఉపాధ్యాయులు, ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు, తల్లిదండ్రులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
