Jeelugumilli : చిర్రి బాలరాజు కృషికి ఫలితం.. ఏలూరు డివిజన్‌లోకి పోలవరం, జీలుగుమిల్లి పశుసంవర్ధక విభాగాలు
ఏలూరు జిల్లా : జీలుగుమిల్లి : స్వచ్ఛవార్త :
పోలవరం నియోజకవర్గ ప్రజలకు ఉపయోగపడే మరో కీలక నిర్ణయం వెలువడింది. పశుసంవర్ధక శాఖ డైరెక్టరేట్, విజయవాడ జారీ చేసిన మెమో ప్రకారం, పోలవరం మరియు జీలుగుమిల్లి మండలాల పశుసంవర్ధక సేవల పరిపాలనా పరిధిని నూజివీడు డివిజన్ నుంచి ఏలూరు పశుసంవర్ధక డివిజన్‌కు మార్చే ప్రతిపాదనకు ప్రభుత్వం ఆమోద ప్రక్రియను పూర్తి చేసింది.
ఈ మార్పు కోసం పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఏపీఎస్టీసీఎఫ్‌సీఎల్ (ట్రికర్ ) ఛైర్మన్ బొరగం శ్రీనివాసులు ప్రభుత్వ దృష్టికి సమస్యను తీసుకెళ్లి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. వారి ప్రతిపాదనను పరిగణనలోకి తీసుకున్న జిల్లా పశుసంవర్ధక అధికారి ( డి ఏ హెచ్ ఓ ), అనంతరం పశుసంవర్ధక శాఖ డైరెక్టరేట్ ఈ అంశంపై తుది చర్యలు చేపట్టింది.
ఈ నిర్ణయంతో పోలవరం, జీలుగుమిల్లి ప్రాంతాల పశుసంవర్ధక సేవల నిర్వహణ మరింత సులభతరం కానుండగా, రైతులు, పశుపోషకులకు పరిపాలనా సేవలు వేగంగా అందే అవకాశం ఏర్పడనుంది.
ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని తమ విజ్ఞప్తిని ఆమోదించిన రాష్ట్ర ప్రభుత్వానికి, సంబంధిత అధికారులకు ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారమే తన ప్రధాన లక్ష్యమని, నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
