Kakinada : జేఎన్టీయూలో జాతీయ క్వాంటమ్ మిషన్‌పై అవగాహన సదస్సు
కాకినాడ జిల్లా : కాకినాడ : స్వచ్ఛవార్త :
జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ కాకినాడ (జేఎన్టీయూకే) ఆధ్వర్యంలో జాతీయ క్వాంటమ్ మిషన్ (ఎన్‌క్యూఎం) కార్యకలాపాలు, శాస్త్ర సాంకేతిక శాఖ (డీఎస్టీ) అందిస్తున్న పరిశోధన నిధుల అవకాశాలపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక ఇంటరాక్టివ్ సెషన్‌ను శుక్రవారం యూనివర్సిటీ సెనేట్ హాలులో నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి జాతీయ క్వాంటమ్ మిషన్ డైరెక్టర్ డాక్టర్ జె.బి.వి. రెడ్డి, ఆంధ్రప్రదేశ్ స్టేట్ క్వాంటమ్ మిషన్ డైరెక్టర్ సి.వి. శ్రీధర్ ముఖ్య వక్తలుగా హాజరయ్యారు. జేఎన్టీయూకే ఉపకులపతి ప్రొఫెసర్ సి.ఎస్.ఆర్.కె. ప్రసాద్ అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా ఉపకులపతి మాట్లాడుతూ..
భవిష్యత్ శాస్త్ర, సాంకేతిక, ఇంజినీరింగ్ రంగాల్లో క్వాంటమ్ టెక్నాలజీలు విప్లవాత్మక మార్పులకు దారితీస్తాయని అన్నారు. అధ్యాపకులు అంతరశాఖ పరిశోధనలకు ప్రాధాన్యతనిస్తూ క్వాంటమ్ ప్రయోగశాలల ఏర్పాటుకు కృషి చేయాలని, డీఎస్టీ ద్వారా లభిస్తున్న నిధుల అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
డాక్టర్ జె.బి.వి. రెడ్డి జాతీయ క్వాంటమ్ మిషన్ లక్ష్యాలు, క్వాంటమ్ కంప్యూటింగ్, క్వాంటమ్ కమ్యూనికేషన్, క్వాంటమ్ సెన్సింగ్, క్వాంటమ్ మెటీరియల్స్ రంగాల్లో పరిశోధన అవకాశాలను వివరించారు. అలాగే జాతీయ స్థాయిలో అందుబాటులో ఉన్న నిధులు, పరిశోధన ప్రాజెక్టుల రూపకల్పనపై అధ్యాపకులకు అవగాహన కల్పించారు.
సి.వి. శ్రీధర్ మాట్లాడుతూ..
రాష్ట్రంలో విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థలు, స్టార్టప్‌లు, పరిశ్రమల భాగస్వామ్యంతో క్వాంటమ్ టెక్నాలజీ పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. అధ్యాపకులు పరిశోధన ప్రతిపాదనలు సమర్పించి ఈ అవకాశాలను వినియోగించుకోవాలని సూచించారు.
అనంతరం నిర్వహించిన ఇంటరాక్టివ్ సెషన్‌లో అధ్యాపకులు క్వాంటమ్ టెక్నాలజీలకు సంబంధించిన పరిశోధన ఆలోచనలు, ప్రాజెక్టు ప్రతిపాదనలు, మౌలిక వసతుల అవసరాలు, విద్యా కార్యక్రమాల రూపకల్పనపై వక్తలతో చర్చించారు.
కార్యక్రమంలో అనుబంధ కళాశాలల ప్రిన్సిపాళ్లు, విభాగాధిపతులు, అధ్యాపకులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని జేఎన్టీయూకే అకాడమిక్స్ డైరెక్టర్, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ క్వాంటమ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ ఎం.హెచ్.ఎం. కృష్ణ ప్రసాద్ సమన్వయం చేశారు.
