Mandavalli : విద్యార్థుల్లో నైతిక విలువలు, క్రమశిక్షణ పెంపొందించుకోవాలి : న్యాయమూర్తి లక్ష్మి
మండవల్లి మండలం లింగాల జెడ్పీ ఉన్నత పాఠశాలలో న్యాయ విజ్ఞాన సదస్సు...
ఏలూరు జిల్లా : మండవల్లి : స్వచ్ఛవార్త :
మండలంలోని లింగాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో సీనియర్ సివిల్ జడ్జి వి.వి.ఎన్.వి. లక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు న్యాయ అవగాహనతో పాటు నైతిక విలువలు, క్రమశిక్షణ, సామాజిక బాధ్యతలపై పలు సూచనలు చేశారు.
విద్యార్థులు పచ్చదనం, పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రతి ఇంటిలో కనీసం ఒక మొక్కను నాటి పర్యావరణ పరిరక్షణకు తమ వంతు బాధ్యత నిర్వర్తించాలని సూచించారు. ప్రకృతిని కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.
అలాగే విద్యార్థులు పెద్దలను గౌరవించడం, మర్యాదగా ప్రవర్తించడం వంటి మంచి అలవాట్లు అలవరుచుకోవాలని సూచించారు. విద్యే భవిష్యత్తుకు బలమైన పునాది అని, ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో చదువుకొని ఉన్నత లక్ష్యాలను సాధించాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో లింగాల పాఠశాల ప్రధానోపాధ్యాయులు, కైకలూరు న్యాయవాదులు, గ్రామ సర్పంచ్, ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.
