📅 డేట్ లోడింగ్... | ⏰ టైమ్ లోడింగ్...

T G : ఓటరు జాబితా సవరణకు సంక్షేమ పథకాలతో సంబంధం లేదు : సీఈఓ సుదర్శన్ రెడ్డి

తెలంగాణ : హైదరాబాద్ : స్వచ్ఛవార్త :

రాష్ట్రంలో ఎస్ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియలో భాగంగా చేపడుతున్న ఓటరు జాబితా సవరణకు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుకు ఎలాంటి సంబంధం లేదని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు.

బుధవారం ఎస్ఐఆర్ ప్రక్రియ పురోగతిపై జిల్లా ఎన్నికల అధికారులు, కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం కొనసాగుతున్న ప్రక్రియ కేవలం తప్పులు లేని ఓటరు జాబితా రూపొందించడానికేనని, ప్రజల్లో ఎలాంటి అపోహలు అవసరం లేదని తెలిపారు.

ఎన్యూమరేషన్ ఫారాల సమర్పణకు మరో ఐదు రోజుల గడువు మాత్రమే మిగిలి ఉన్నందున ఆగస్టు 3లోగా డిజిటలైజేషన్ ప్రక్రియను వంద శాతం పూర్తి చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 76 శాతం డిజిటలైజేషన్ పూర్తయిందని, గ్రామీణ ప్రాంతాల్లో ఇది 90 శాతానికి చేరుకుందని వెల్లడించారు.

ఖానాపూర్, బాల్కొండ, ఎల్లారెడ్డి, హుజూర్‌నగర్, నర్సంపేట్, వర్ధన్నపేట, పరకాల, బోధ్ నియోజకవర్గాల్లో డిజిటలైజేషన్ పూర్తిస్థాయిలో ముగిసిందని పేర్కొంటూ సంబంధిత అధికారులను అభినందించారు. మరోవైపు శేరిలింగంపల్లి, రంగారెడ్డి, మేడ్చల్, జీహెచ్‌ఎంసీతో పాటు నిజామాబాద్, వరంగల్, ఖమ్మం పట్టణ ప్రాంతాల్లో ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు.

ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ సమయంలో ఓటర్ల వివరాలను ఎలాంటి పొరపాట్లు లేకుండా నమోదు చేయాలని బీఎల్‌వోలు, సూపర్‌వైజర్లకు ఆదేశించారు. నిర్లక్ష్యం వహించిన అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్ ప్రక్రియను కూడా వేగవంతం చేయాలని సూచించిన సుదర్శన్ రెడ్డి, ఒకే కుటుంబానికి చెందిన ఓటర్ల పేర్లు సాధ్యమైనంత వరకు ఒకే పోలింగ్ కేంద్రంలో ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు.

మరణించిన ఓటర్లు, నివాసం మార్చుకున్నవారు, అందుబాటులో లేని ఓటర్ల వివరాల జాబితా సిద్ధం చేసే సమయంలో అన్ని రాజకీయ పార్టీల బీఎల్‌ఏల సంతకాలు తప్పనిసరిగా తీసుకోవాలని ఆదేశించారు. రాజకీయ పార్టీలతో నిర్వహించే సమావేశాలను వీడియోగ్రఫీ చేసి రికార్డు చేయాలని సూచించారు.

సమావేశంలో అదనపు ప్రధాన ఎన్నికల అధికారి వాసం వెంకటేశ్వర్లు, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్, డిప్యూటీ ఎన్నికల అధికారి చారి, పీఎం ఐటీ చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.

షేర్ చేయండి: 📱 WhatsApp 📘 Facebook ✖️ X

Popular News From This Site

Kaikaluru Rural Circle : ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు : కైకలూరు రూరల్‌ సీఐ వి.రవికుమార్‌

Kalidindi : కలిదిండిలో ఎన్డీఏ మండల సమావేశం.. కూటమిలోకి పలువురు వైకాపా నేతలు

Eluru : జిల్లాలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు : జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి

Mandavalli : ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి.. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే నాయకులకు అధికారుల సూచనలు

Kaikaluru : సాంకేతిక ఆధారాలతో కుట్రపూరిత నేరాన్ని ఛేదించిన కలిదిండి పోలీసులు

Kaikaluru Town : సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడితే చర్యలు తప్పవు

Kaikaluru : ప్రజలకు అందుబాటులో ఉంటూ నిబద్ధతతో పనిచేయాలి : జక్కుల విజయ్ కుమార్

Kaikaluru : వీరాబత్తిన సుధకు పలువురు టీడీపీ నేతల పరామర్శ

Mudinepalli : ముదినేపల్లి జడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థుల ప్రకటన.. జడ్పీటీసీగా బొర్రా చలమయ్య.. ఎంపీపీగా కోటప్రోలు నాగరత్నకుమారి

Gudlavalleru : శ్రీ కొండలమ్మ అమ్మవారి మహా అన్నసమారాధనకు 250 కిలోల బియ్యం విరాళం