Aadilabad : హజ్ యాత్ర పేరుతో రూ.11 లక్షల మోసం.. ఇద్దరు ఏజెంట్లపై కేసు నమోదు
- ఇంకా బాధితులు ఉంటే జిల్లా పోలీసులను సంప్రదించాలి...
- ఆదిలాబాద్ వన్ టౌన్ ఎస్‌హెచ్‌ఓ బి. సునీల్ కుమార్...
ఆదిలాబాద్ జిల్లా : ఆదిలాబాద్ : స్వచ్ఛవార్త :
ఆదిలాబాద్ పట్టణంలోని బొక్కలగూడకు చెందిన షేక్ సద్దాం తన స్నేహితుడితో కలిసి హజ్ యాత్రకు వెళ్లేందుకు 2026 సంవత్సరంలో గోల్డెన్ ట్రావెల్స్ ద్వారా ఏజెంట్లను సంప్రదించినట్లు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. హజ్ యాత్రకు సంబంధించి ఏజెంట్లకు మొత్తం రూ.42 లక్షలు చెల్లించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఏజెంట్లు గోల్డెన్ ట్రావెల్స్‌కు రూ.31 లక్షలు మాత్రమే చెల్లించారని, మరో రూ.11 లక్షలు బకాయి ఉన్నట్లు గోల్డెన్ ట్రావెల్స్ ద్వారా తెలిసిందని ఫిర్యాదుదారు తెలిపారు. దీంతో ఫిర్యాదుదారు రూ.6 లక్షలు, రూ.5 లక్షల చొప్పున రెండు చెక్కుల ద్వారా మిగిలిన రూ.11 లక్షలను నేరుగా గోల్డెన్ ట్రావెల్స్‌కు చెల్లించినట్లు పేర్కొన్నారు.
హజ్ యాత్ర పూర్తి చేసుకొని తిరిగి వచ్చిన అనంతరం ఏజెంట్లను సంప్రదించి రూ.11 లక్షల మొత్తాన్ని తిరిగి ఇవ్వాలని కోరగా పలుమార్లు వాయిదా వేస్తూ వచ్చారని, అనంతరం ఫోన్‌లు స్విచ్ఛాఫ్‌గా ఉన్నాయని ఫిర్యాదుదారు తెలిపారు.
ఫిర్యాదు మేరకు ఆదిలాబాద్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
నిందితుల వివరాలు :
A1) ముదాసిర్ అహ్మద్ (32) S/o మానేసూర్ అహ్మద్, వృత్తి: ఏజెంట్, ఖుబా ఇంటర్నేషనల్స్, నివాసం: తిమ్మాపూర్, నిర్మల్.
A2) మహమ్మద్ ఇనూస్ షేక్ – పరారీలో ఉన్నాడు.
ఈ కేసులో A1 ముదాసిర్ అహ్మద్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. మరో నిందితుడు A2 మహమ్మద్ ఇనూస్ షేక్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
ఇతర బాధితులు ఎవరైనా ఉంటే ఆదిలాబాద్ జిల్లా పోలీసులను సంప్రదించాలని వన్ టౌన్ ఎస్‌హెచ్‌ఓ బి. సునీల్ కుమార్ తెలిపారు. బాధితుల వివరాలను పోలీసుల దృష్టికి తీసుకువచ్చి చట్టపరమైన చర్యలకు సహకరించాలని కోరారు.
