Avanigadda : అవనిగడ్డ పంచాయతీ నిధుల గోల్మాల్ వ్యవహారంలో కీలక పరిణామం.. నలుగురు అధికారులకు ‘ఆర్టికల్ ఆఫ్ ఛార్జెస్’
కృష్ణాజిల్లా : అవనిగడ్డ : స్వచ్ఛవార్త :
అవనిగడ్డ గ్రామ పంచాయతీలో 2012–16 మధ్య కాలంలో సుమారు రూ.50 లక్షల నిధుల దుర్వినియోగానికి సంబంధించిన వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. సామాజిక కార్యకర్త, యునైటెడ్ ఫోరమ్ ఫర్ ఆర్‌టీఐ క్యాంపెయిన్ ప్రతినిధి జంపాన శ్రీనివాస గౌడ్ చేసిన ఫిర్యాదు ఆధారంగా రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ వి.ఆర్. కృష్ణతేజ మైలవరపు నలుగురు అధికారులపై ‘ఆర్టికల్ ఆఫ్ ఛార్జెస్’ జారీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.
లోకాయుక్తను ఆశ్రయించిన "జంపాన" :
నిధుల దుర్వినియోగంపై చర్యలు తీసుకోవాలని కోరుతూ జంపాన శ్రీనివాస గౌడ్ 31 జనవరి 2020న లోకాయుక్తను ఆశ్రయించారు. కేసు నెం. 115/2020/లోక్/బి1 కింద ఫిర్యాదు దాఖలు చేశారు. ఫిర్యాదుతోపాటు సమర్పించిన ఆధారాలను పరిశీలించిన లోకాయుక్త న్యాయమూర్తులు జస్టిస్ పి. లక్ష్మణరెడ్డి, జస్టిస్ పి. రజని సమగ్ర విచారణకు ఆదేశించారు.
అనంతరం కృష్ణా జిల్లా పంచాయతీ అధికారి జె. అరుణ విచారణ నిర్వహించి నివేదిక సమర్పించారు. పంచాయతీరాజ్ ఉద్యోగుల ప్రవర్తనా నియమావళి–1991లోని రూల్ 9 ప్రకారం తదుపరి చర్యలు చేపట్టి, నలుగురిపై అభియోగాలను ఖరారు చేసినట్లు సమాచారం.
నలుగురిపై అభియోగాలు :
- వి. రంగారావు : మాజీ పంచాయతీ కార్యదర్శి. ధ్రువీకరణ పత్రాల ట్యాంపరింగ్ వ్యవహారంలో ఇప్పటికే నిర్బంధ పదవీ విరమణ పొందారు.
- కె. రామ్ ప్రసాద్ : జూనియర్ అసిస్టెంట్. ప్రస్తుతం పులిగడ్డ గ్రామ పంచాయతీలో పనిచేస్తున్నారు.
- ఎం. లక్ష్మణరావు : అవనిగడ్డ పంచాయతీ సిబ్బంది. ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్నారు.
- ఎల్.వి.వి.ఎస్. శ్రీనివాసరావు : ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈగా పనిచేశారు. 13 మే 2015న మరణించారు.
అవినీతిపై పోరాటం కొనసాగుతుంది :
గ్రామ పంచాయతీ నిధుల దుర్వినియోగంలో అవనిగడ్డకు రాష్ట్రస్థాయిలోనే ప్రథమ స్థానం రావడం బాధాకరమని జంపాన శ్రీనివాస గౌడ్, బేతపూడి జోగేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం కూడా మంచినీటి ట్యాపుల మంజూరు, ధ్రువీకరణ పత్రాల జారీ వంటి అంశాల్లో అవినీతి జరుగుతోందని వారు ఆరోపించారు. అక్రమాలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకునే వరకు తమ పోరాటం కొనసాగుతుందని జంపాన శ్రీనివాస గౌడ్ స్పష్టం చేశారు.
