Bhimavaram : 24 గంటల్లో మైనర్ బాలికను క్షేమంగా గుర్తించిన పశ్చిమగోదావరి పోలీసులు.. తల్లిదండ్రులకు అప్పగింత
పశ్చిమగోదావరి జిల్లా : భీమవరం : స్వచ్ఛవార్త :
తల్లిదండ్రులు చదువు విషయంలో మందలించారనే మనస్తాపంతో ఇంటి నుంచి వెళ్లిపోయిన 15 ఏళ్ల మైనర్ బాలికను పశ్చిమగోదావరి జిల్లా పోలీసులు కేవలం 24 గంటల్లో గుర్తించి మంగళవారం సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు.
తణుకు పట్టణానికి చెందిన ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం విద్యార్థిని ఈ నెల 3వ తేదీ తెల్లవారుజామున ఇంటి నుంచి వెళ్లిపోయింది. కుటుంబ సభ్యులు బంధువుల ఇళ్లలో, పరిసర ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ లభించకపోవడంతో అదే రోజు తణుకు టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో తణుకు టౌన్ ఇన్‌స్పెక్టర్ జె. వెంకటరమణ మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి, రియల్ టైమ్ గవర్నెన్స్ (RTGS) సాంకేతికత, సీసీటీవీ-360 యాప్, సీసీటీవీ ఫుటేజీలు తదితర ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి బాలిక కదలికలను గుర్తించాయి. ఈ క్రమంలో విజయవాడలో ఆమెను క్షేమంగా గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.
ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ.. చిన్నచిన్న కారణాలతో విద్యార్థులు, మైనర్లు ఇంటిని విడిచి వెళ్లే ఘటనలు ఆందోళనకరమని తెలిపారు. క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు వారి భవిష్యత్తును ప్రమాదంలో పడేస్తాయని హెచ్చరించారు. ముఖ్యంగా బాలికలు మానవ అక్రమ రవాణా, మోసాలు, వేధింపులు వంటి ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉన్నందున తల్లిదండ్రులు పిల్లలతో స్నేహపూర్వకంగా మెలగాలని, పిల్లలు కూడా తమ సమస్యలను కుటుంబ సభ్యులు లేదా ఉపాధ్యాయులతో పంచుకోవాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే పోలీసులను ఆశ్రయించాలని విజ్ఞప్తి చేశారు.
