Bhimavaram : సర్దార్ గౌతు లచ్చన్న కు జిల్లా పోలీసు యంత్రాంగం ఘన నివాళి
పశ్చిమగోదావరి జిల్లా : జిల్లా పోలీసు కార్యాలయం : భీమవరం : స్వచ్ఛవార్త :
స్వాతంత్ర్య సమరయోధులు, ప్రముఖ కర్షక నాయకులు మరియు అణగారిన వర్గాల అభ్యున్నతికి జీవితాన్ని అంకితం చేసిన మహానీయులు సర్దార్ గౌతు లచ్చన్న 177వ జయంతి వేడుకలను పురస్కరించుకుని, ఆదివారం గొల్లలకోడేరులోని జిల్లా పోలీసు కార్యాలయంలో ఘనంగా నివాళులర్పించడం జరిగింది.
పశ్చిమగోదావరి జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి ఆదేశానుసారం జిల్లా ఆర్మ్డ్ రిజర్వ్ డీఎస్పీ ఎం.వి.వి సత్యనారాయణ పాల్గొని సర్దార్ గౌతు లచ్చన్న చిత్రపటానికి పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా జరిగిన సభను ఉద్దేశించి డీఎస్పీ మాట్లాడుతూ...
నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా, రైతాంగ హక్కుల పరిరక్షణ మరియు కార్మిక సంక్షేమం కోసం సర్దార్ గౌతు లచ్చన్న సాగించిన పోరాటాలు అత్యంత అసాధారణమైనవని కొనియాడారు. బ్రిటీష్ సామ్రాజ్యవాదానికి ఎదురొడ్డి నిలవడంతో పాటు, స్వతంత్ర భారతదేశంలోనూ ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించడానికి ఆయన నిరంతరం శ్రమించారని, అందుకే ఆయనకు 'సర్దార్' బిరుదు సార్థకమైందని పేర్కొన్నారు.
ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో రైతాంగ సమస్యలపై ఆయన చేపట్టిన చరిత్రాత్మక ఉద్యమాలు, శ్రామిక వర్గాల పక్షాన ఆయన చేసిన రాజీలేని పోరాటాలు నేటి తరానికి ఎప్పటికీ స్ఫూర్తిదాయకమని స్పష్టం చేశారు. అధికారంలో ఉన్నా, లేకపోయినా ప్రజల పక్షానే నిలబడిన ఆయన రాజకీయ నిబద్ధత ప్రతి ఒక్క అధికార యంత్రాంగానికి, నాయకునికి ఆదర్శప్రాయమని తెలిపారు.
కార్యక్రమంలో మహిళా ఆర్మ్డ్ రిజర్వ్ ఇన్స్పెక్టర్ (అడ్మిన్) ఇ. ఇందుమతి, ఆర్ఎస్సై కె. గోపి కృష్ణ, ఇతర పోలీస్ అధికారులు, జిల్లా కార్యాలయ సిబ్బంది పాల్గొని ఘనంగా నివాళులు అర్పించారు.


