Bhimavaram : మెగా డీఎస్సీపై వైకాపా దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండించిన టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు (కేఎన్ఆర్)
పశ్చిమగోదావరి జిల్లా : భీమవరం : స్వచ్ఛవార్త :
మెగా డీఎస్సీపై వైఎస్సార్‌సీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అసత్యమని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు(KNR) విమర్శించారు. శనివారం భీమవరంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో మెగా డీఎస్సీని ప్రభుత్వం పారదర్శకంగా నిర్వహించిందని కేఎన్ఆర్ తెలిపారు. డీఎస్సీ నియామకాలపై వైఎస్సార్‌సీపీ నేతలు చేస్తున్న ఆరోపణలను ప్రజలు నమ్మరని అన్నారు. వైఎస్సార్‌సీపీ చేస్తున్న ఆరోపణలు పూర్తిగా రాజకీయ ప్రేరేపితమని విమర్శించారు.
నిబంధనలకు విరుద్ధంగా రోడ్లపై దీక్షలు నిర్వహిస్తూ ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నారని ఆయన ఆరోపించారు. మెగా డీఎస్సీలో అక్రమాలు జరిగాయంటూ వైఎస్సార్‌సీపీ చేస్తున్న ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని, వాస్తవాలను వక్రీకరించి రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.
విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌పై, రాష్ట్ర ప్రభుత్వంపై వైఎస్సార్‌సీపీ నేతలు చేస్తున్న అసత్య ప్రచారాలను తీవ్రంగా ఖండిస్తున్నామని కోళ్ల నాగేశ్వరరావు(KNR) తెలిపారు.
