Bhimavaram : భీమవరం మావుళ్లమ్మ ఆలయంలో సహస్ర గళ భగవద్గీత పారాయణం
1,108 మంది మహిళలతో ఆధ్యాత్మిక కార్యక్రమం.. విశేషంగా పాల్గొన్న భక్తులు
పశ్చిమగోదావరి జిల్లా : భీమవరం (మావుళ్లమ్మ దేవస్థానం): స్వచ్ఛవార్త :
భగవద్గీత పఠనంతో ఆత్మజ్ఞానం, సత్ప్రవర్తన అలవడటంతో పాటు మానసిక ప్రశాంతత, ధైర్యం, ఏకాగ్రత పెరుగుతాయని ఆలయ ఈవో బుద్ధ మహాలక్ష్మి నగేష్, చైర్మన్ బొండాడ నాగభూషణం తెలిపారు. అవధూత దత్త పీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామి అనుగ్రహంతో నిర్వహిస్తున్న కోటి సంపూర్ణ భగవద్గీత పారాయణంలో భాగంగా శనివారం మావుళ్లమ్మ ఆలయంలో 1,108 మంది మహిళలతో సహస్ర గళ సంపూర్ణ భగవద్గీత పారాయణం నిర్వహించారు.
ఈ సందర్భంగా ట్రస్ట్ సభ్యుడు వీవీఎస్ శర్మ మాట్లాడుతూ..
గీతా పారాయణం ప్రతి ఒక్కరికీ కర్తవ్య నిర్వహణలో మార్గదర్శకంగా నిలుస్తుందన్నారు. మహిళలందరూ ముక్తకంఠంతో గీతా పారాయణం చేయడం శుభపరిణామమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావు, ఆలయ ధర్మకర్తలు, ఎక్స్‌అఫీషియో సభ్యుడు మద్దిరాల మల్లికార్జున శర్మ తదితరులు పాల్గొన్నారు
.
