Challapalli : సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగంపై ఇక కఠిన చర్యలు : జిల్లా కలెక్టర్ డీకే బాలాజి
కృష్ణా జిల్లా : చల్లపల్లి : స్వచ్ఛవార్త :
పర్యావరణ పరిరక్షణలో భాగంగా సెప్టెంబర్ 1వ తేదీ నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగంపై నిబంధనలను కఠినంగా అమలు చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ డీకే బాలాజి తెలిపారు. ప్రజలు, వ్యాపారులు, ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నియంత్రించాలని ఆయన పిలుపునిచ్చారు.
సోమవారం జిల్లా పంచాయతీ శాఖ ఆధ్వర్యంలో చల్లపల్లిలో నిర్వహించిన ప్లాస్టిక్ రహిత చల్లపల్లి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా “ప్లాస్టిక్ వద్దు.. కాటన్ సంచులే ముద్దు”, “ప్లాస్టిక్ వాడకం మానేద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం” వంటి నినాదాలతో నిర్వహించిన ర్యాలీలో పాల్గొని, అనంతరం ప్రజలు, విద్యార్థులు, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు మానవహారం నిర్వహించి ప్లాస్టిక్ రహిత సమాజం కోసం ప్రతిజ్ఞ చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ..
క్యారీ బ్యాగులు, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులతో పాటు లోపల ప్లాస్టిక్ కోటింగ్ ఉన్న పేపర్ కప్పుల వినియోగాన్ని కూడా నియంత్రించాల్సి ఉందన్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధంపై ప్రజలకు ఇప్పటికే అవగాహన కల్పించామని, చల్లపల్లిలో రెండు వారాల క్రితం సమావేశం నిర్వహించడంతో పాటు ప్రతిరోజూ ఆటోల ద్వారా ప్రచారం నిర్వహించినట్లు తెలిపారు.
సెప్టెంబర్ 1వ తేదీ నుంచి నిబంధనలను కఠినంగా అమలు చేస్తామని, ప్రజలు, వ్యాపారులు అధికారులకు సహకరించాలని కోరారు. పంచాయతీ అధికారులు, ఈవోలు, ఎంపీడీవోలు, పంచాయతీ కార్యదర్శులు ప్లాస్టిక్ నిషేధాన్ని క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేసి చల్లపల్లిని ప్లాస్టిక్ రహిత ప్రాంతంగా తీర్చిదిద్దాలని సూచించారు.
సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వల్ల పర్యావరణానికి తీవ్ర నష్టం కలుగుతోందని, డ్రైనేజీల్లో ప్లాస్టిక్ పేరుకుపోవడం వల్ల మురుగునీరు నిలిచిపోయి దోమల వృద్ధికి, తద్వారా వ్యాధుల వ్యాప్తికి అవకాశం ఏర్పడుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. మైక్రో ప్లాస్టిక్ కూడా పర్యావరణానికి తీవ్ర ముప్పుగా మారుతోందన్నారు.
గతంలో మాదిరిగా ప్రతి ఒక్కరూ గుడ్డ సంచులను వినియోగించాలని, టీ తదితర పానీయాలకు ప్లాస్టిక్ కోటింగ్ ఉన్న కప్పులకు బదులుగా పునర్వినియోగించగల పాత్రలను ఉపయోగించే అలవాటును తిరిగి తీసుకురావాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. ప్రజలందరి భాగస్వామ్యంతో చల్లపల్లిని ప్లాస్టిక్ రహిత ప్రాంతంగా తీర్చిదిద్దవచ్చని ఆయన పేర్కొన్నారు.
కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారిణి ఎం ధనలక్ష్మి, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ డడి.ఆర్.కె. ప్రసాద్, అవనిగడ్డ డివిజన్ డిఎస్పి ఆర్ అభిషేక్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు, విద్యార్థులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
