Chintalapudi : చింతలపూడి ఎత్తిపోతల పథకం త్వరగా ప్రారంభించి పూర్తి చేయాలి.. సీఎం చంద్రబాబు కు ఎమ్మెల్యే సొంగా వినతి
ఏలూరు జిల్లా : చింతలపూడి : స్వచ్ఛవార్త :
చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులను త్వరగా ప్రారంభించి పూర్తి చేయాలని ఎమ్మెల్యే రోషన్ కుమార్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కోరారు. సోమవారం కైకలూరు నియోజకవర్గంలోని కలిదిండి పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రిని ఎమ్మెల్యే మర్యాదపూర్వకంగా కలిసి నియోజకవర్గంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి వినతిపత్రాన్ని సమర్పించారు.
నియోజకవర్గంలోని ప్రధాన రహదారుల అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే కోరారు. అలాగే మూడు ముఖ్యమైన బ్రిడ్జిల నిర్మాణం, నర్సింగ్ కళాశాల ఏర్పాటు, బాలికల రెసిడెన్షియల్ కళాశాల ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
అదేవిధంగా ఏలూరు–మేడిశెట్టివారి పాలెం రోడ్డును నాలుగు లేన్ల రహదారిగా విస్తరించాలని, చింతలపూడిలో హార్టికల్చర్ అసిస్టెంట్ డైరెక్టర్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ ముఖ్యమంత్రికి వినతిపత్రం అందించారు.
ఎమ్మెల్యే రోషన్ కుమార్ సమర్పించిన వినతిపత్రంలోని అంశాలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చినట్లు ఓ ప్రకటనలో ఆయన తెలిపారు.
