Eluru : జూట్ మిల్లు కార్మికుల నిరుద్యోగ భృతి విడుదల చేయాలి : లోక్‌సభలో ఎంపీ పుట్టా మహేష్ కుమార్
ఢిల్లీ/ఏలూరు : స్వచ్ఛవార్త :
ఏలూరులో మూతపడిన శ్రీకృష్ణ జూట్ మిల్లు, కొత్తూరులోని కృష్ణ హెసియన్స్ పరిశ్రమలకు చెందిన సుమారు 4 వేల మంది కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ బుధవారం లోక్‌సభలో ప్రస్తావించారు. రూల్–377 కింద ఈ అంశాన్ని లేవనెత్తిన ఆయన, అర్హులైన కార్మికులకు పెండింగ్‌లో ఉన్న నిరుద్యోగ భృతిని తక్షణమే విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ..
1948 ఈఎస్ఐ చట్టంలోని "అటల్ బీమిత్ వ్యక్తి కళ్యాణ్ యోజన" కింద కార్మికులు నిరుద్యోగ భృతికి అర్హులని తెలిపారు. అయితే, కొత్తూరు యూనిట్‌కు చెందిన సుమారు 200 మంది కార్మికులకు మాత్రమే ఈ ప్రయోజనం అందిందని, మిగిలిన వారి దరఖాస్తులు ఈఎస్ఐ ప్రధాన కార్యాలయంలో ఇప్పటికీ పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు.
ఏలూరులోని శ్రీకృష్ణ జూట్ మిల్లు 2022 మార్చి 3న కార్యకలాపాలు నిలిపివేసిన తర్వాత కార్మికులను కొత్తూరు యూనిట్‌కు బదిలీ చేశారని, అనంతరం ఆ యూనిట్ కూడా మూతపడిందని పేర్కొన్నారు. 2023 జూన్ 22న తుది పరిష్కార ఒప్పందం కుదిరిన అనంతరం కార్మికులు నిరుద్యోగ భృతి కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ, వారికి ఇప్పటివరకు పూర్తి స్థాయిలో ప్రయోజనం అందలేదని వివరించారు.
ఈ నేపథ్యంలో ఈ వ్యవహారాన్ని ప్రత్యేక కేసుగా పరిగణించి, పరిష్కార ఒప్పంద తేదీని అర్హతకు ప్రామాణికంగా తీసుకుని, ప్రభావిత కార్మికులందరికీ నిరుద్యోగ భృతిని మరింత ఆలస్యం లేకుండా విడుదల చేసేలా ఈఎస్ఐ అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కోరారు.
