Eluru : రెండేళ్ల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సమగ్ర నివేదికలు సిద్ధం చేయాలి : అధికారులకు కలెక్టర్ వెట్రిసెల్వి ఆదేశం
ఏలూరు జిల్లా : కలెక్టరేట్ : స్వచ్ఛవార్త :
జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖలు గత రెండేళ్లలో చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, సాధించిన విజయాలపై సమగ్ర నివేదికలు సిద్ధం చేసి నిర్ణీత గడువులోగా సమర్పించాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు.
జిల్లా కలెక్టరేట్‌లోని గౌతమీ సమావేశ మందిరంలో ఈనెల 10న కైకలూరు నియోజకవర్గం కలిదిండి మండలంలో ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో గురువారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు.
ఈ సందర్భంగా ప్రతి శాఖ తమ ప్రొఫైల్, ప్రధాన కార్యకలాపాలు, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు, వాటి అమలు తీరు, సాధించిన పురోగతి, విజయాలను సమగ్రంగా పొందుపరిచే విధంగా నివేదికలు సిద్ధం చేయాలని సూచించారు. ముఖ్యంగా జిల్లాలో రీ-సర్వే, పట్టాదార్ పాస్‌పుస్తకాల జారీ పురోగతి, బంగారు కుటుంబాల దత్తత కార్యక్రమం, పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ కార్యక్రమాలు, పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్‌లు, 22(ఏ) కేసుల పరిష్కారం, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వివరాలను స్పష్టంగా పొందుపరచాలని ఆదేశించారు.
అలాగే కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ (KPI) ఆధారంగా శాఖల పనితీరు, లక్ష్యాల సాధన, ప్రత్యేక కార్యక్రమాల వివరాలను తాజా గణాంకాలతో సిద్ధం చేయాలని తెలిపారు. జూన్ 2024 నుంచి శాఖల వారీగా సమగ్ర సమాచారం, విజయగాథలతో పాటు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్లు, సీడీలు కూడా సిద్ధం చేయాలని సూచించారు.
సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎం.జె. అభిషేక్ గౌడ, అసిస్టెంట్ కలెక్టర్ సి.హెచ్. శ్రావణ్ కుమార్ రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి ఎం. శ్రీదేవి, విజిలెన్స్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎల్. దేవకీ దేవి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
