Gannavaram : భారత ఉపరాష్ట్రపతి పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి –అధికారులకు జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ ఎం. నవీన్ ఆదేశం
కృష్ణాజిల్లా : గన్నవరం : స్వచ్ఛవార్త :
ఈ నెల 24వ తేదీన భారత ఉపరాష్ట్రపతి విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి రానున్న నేపథ్యంలో పర్యటనకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని కృష్ణాజిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ ఎం. నవీన్ అధికారులను ఆదేశించారు.
గురువారం సాయంత్రం విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయములోని విశిష్ట అతిథుల భవన సమావేశ మందిరంలో జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడుతో కలిసి సంబంధిత శాఖల అధికారులతో ఉపరాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
ఉపరాష్ట్రపతి ఏలూరు జిల్లాలో జరిగే కార్యక్రమంలో పాల్గొననున్నందున, గన్నవరం విమానాశ్రయంలో స్వాగతం, తిరుగు ప్రయాణ కార్యక్రమాలకు అవసరమైన అన్ని ఏర్పాట్లను సమన్వయంతో చేపట్టాలని తెలిపారు. పర్యటన ఏర్పాట్లకు ఆర్డీఓ గుడివాడను ఓవరాల్ ఇన్‌చార్జిగా నియమించి, అన్ని శాఖల అధికారులు ఆయనతో సమన్వయం చేసుకోవాలని సూచించారు.
వీఐపీ రిసెప్షన్, గ్రీన్ రూమ్‌లు, పార్కింగ్, అల్పాహారం, వైద్య సదుపాయాలు తదితర ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని తెలిపారు. ఉపరాష్ట్రపతికి అందించే ఆహారం, అల్పాహారం నాణ్యతను ఫుడ్ సేఫ్టీ అధికారులు పర్యవేక్షించాలని, అవసరమైన నమూనాలను సేకరించి పరీక్షించాలని ఆదేశించారు.
వైద్యపరంగా అత్యవసర పరిస్థితులు ఎదురైతే వెంటనే స్పందించేలా డీఎంహెచ్‌ఓ, డీసీహెచ్‌ఎస్, జీజీహెచ్, ఏపీవీవీపీ అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. అత్యవసర వైద్య పరికరాలు, వైద్య నిపుణులను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.
జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు మాట్లాడుతూ...
ఉపరాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో విమానాశ్రయం నుంచి ఏలూరు జిల్లా ముసునూరు వరకు భద్రతా చర్యలను పటిష్టంగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
ఉపరాష్ట్రపతి కాన్వాయ్‌ను ఏలూరు జిల్లా నుంచి ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో కృష్ణాజిల్లా పరిధిలో అవసరమైన పైలట్ వాహనాలను సమన్వయం చేయాలని తెలిపారు. విమానాశ్రయం నుంచి గమ్యస్థానం వరకు మొత్తం రూట్‌ను మరోసారి క్షుణ్ణంగా పరిశీలించి, ముఖ్యమైన రూట్ పాయింట్లను గుర్తించాలని సూచించారు.
విమానాశ్రయంలోని కొత్త టెర్మినల్‌తో పాటు అన్ని కీలక ప్రాంతాలను భద్రతా పరిధిలోకి తీసుకురావాలని తెలిపారు. విమానాశ్రయం, పార్కింగ్ ప్రాంతాలు, మొత్తం ప్రయాణ మార్గంలో బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్, వీడియో బృందాలను అవసరమైన విధంగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పార్కింగ్ ప్రాంతాల్లోకి వచ్చే వాహనాలను పూర్తిస్థాయిలో తనిఖీ చేసిన అనంతరం మాత్రమే అనుమతించాలని, అనధికారిక వాహనాలు, జనసమూహాలను ప్రధాన మార్గం వద్దనే నియంత్రించాలని స్పష్టం చేశారు.
ట్రాఫిక్ నిర్వహణలో భాగంగా జాతీయ రహదారిపై ముఖ్యమైన జంక్షన్లు, ఫ్లైఓవర్ల కింద ఉన్న జాయినింగ్ పాయింట్లను గుర్తించి బారికేడింగ్ ఏర్పాటు చేయాలని తెలిపారు. కాన్వాయ్ మార్గంలో వాహనాలు అకస్మాత్తుగా ప్రవేశించకుండా ట్రాఫిక్ సిబ్బందిని ఏర్పాటు చేయాలని సూచించారు.
సమావేశంలో ఇంచార్జ్ ఎయిర్పోర్ట్ డైరెక్టర్ ఏకే దేశ్వాల్, విమానాశ్రయ సీఎస్‌వో కె. ధర్మేంద్ర, డిప్యూటీ కలెక్టర్ ఎస్ పోతురాజు, గుడివాడ ఆర్డిఓ జి బాలసుబ్రమణ్యం, గన్నవరం తహసిల్దార్ శివయ్య, వివిధ ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు, స్పెషల్ బ్రాంచ్ సిఐ వై సత్య కిషోర్, తదితరులు పాల్గొన్నారు.
