Ibrajimpatnam : గంజాయిపై పోలీసుల ఉక్కుపాదం.. సమాచారం ఇస్తే నగదు బహుమతి.. ఇబ్రహీంపట్నం సీఐ ఏ. సుబ్రహ్మణ్యం
ఎన్టీఆర్ జిల్లా : ఇబ్రహీంపట్నం : స్వచ్ఛవార్త :
ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్ పరిధిలో గంజాయి వినియోగం, విక్రయాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. గంజాయి తాగే వారి సమాచారం అందిస్తే రూ.1,500, గంజాయి విక్రయించే వారి సమాచారం అందిస్తే రూ.5 వేల నగదు బహుమతి అందజేస్తామని ఇబ్రహీంపట్నం సీఐ ఏ. సుబ్రహ్మణ్యం మీడియా సమావేశంలో తెలిపారు.
మీడియా సమావేశంలో సీఐ మాట్లాడుతూ..
ఇప్పటివరకు 1,190 మందికి గంజాయి వినియోగంపై పరీక్షలు నిర్వహించగా 91 మందికి పాజిటివ్‌గా తేలిందన్నారు. పోలీసులు, ఎన్జీవోల ఆధ్వర్యంలో గంజాయి వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో పలువురిలో మార్పు వచ్చిందని తెలిపారు.
మూడు నెలల అనంతరం గతంలో పరీక్షలు నిర్వహించిన వారికి మరోసారి పరీక్షలు చేయగా 23 మందికి మాత్రమే పాజిటివ్‌గా తేలిందన్నారు. గంజాయి వినియోగదారుల్లో మార్పు రావడం వల్లే ఈ సంఖ్య తగ్గిందని వివరించారు.
గంజాయి సరఫరా, విక్రయాల మూలాలపై కొంతకాలంగా ప్రత్యేక దృష్టి సారించి చర్యలు చేపట్టడంతో గంజాయి అమ్మకాలు, వినియోగించే వారి సంఖ్య తగ్గిందని సీఐ తెలిపారు. రాబోయే రోజుల్లో ఈగల్ కార్యక్రమంలో భాగంగా గంజాయిని పూర్తిస్థాయిలో నిర్మూలించడమే లక్ష్యంగా పనిచేస్తామని చెప్పారు.
గంజాయి నిర్మూలనకు పోలీసుశాఖ చేపడుతున్న కార్యక్రమాలను ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని మీడియా ప్రతినిధులను సీఐ కోరారు.
