Jeelugumilli : నేర దర్యాప్తులో ఆధునిక సాంకేతికతను వినియోగించాలి : సిబ్బందికి అధికారుల సూచన
ఏలూరు జిల్లా : జీలుగుమిల్లి : స్వచ్ఛవార్త :
నేర పరిశోధనలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగిస్తూ, కోర్టులో నిలిచేలా సాక్ష్యాలను పకడ్బందీగా సేకరించాలని పోలీసు అధికారులు సూచించారు. ఏలూరు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, పోలవరం డీఎస్పీ జయకృష్ణ ఆధ్వర్యంలో శుక్రవారం జీలుగుమిల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానంలో పోలీసు సిబ్బందికి పరేడ్ నిర్వహించారు.
అనంతరం జీలుగుమిల్లి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ బి. యాదగిరి ఆధ్వర్యంలో సర్కిల్ పరిధిలోని పోలీసు సిబ్బందికి నేర దర్యాప్తుపై శిక్షణ తరగతులు నిర్వహించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నేరం జరిగిన ప్రదేశాన్ని క్షుణ్ణంగా పరిశీలించడం, నేరస్థల పరిశీలన నివేదికను పద్ధతి ప్రకారం రూపొందించడం వంటి అంశాలపై సిబ్బందికి అవగాహన కల్పించారు.
నేరస్థల సాక్ష్యాల సేకరణపై శిక్షణ :
నేరస్థలాన్ని ఫొటోగ్రఫీ చేసే విధానం, సీన్ ఆఫ్ ఎఫెక్ట్స్‌ను ముందుగా ఎలా చిత్రీకరించాలి, ఘటనా స్థలాన్ని భద్రపరిచే మెలకువలపై శిక్షణ ఇచ్చారు. నేరస్థలంలో లభించే భౌతిక, ఇతర సాక్ష్యాలను ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా శాస్త్రీయ పద్ధతిలో సేకరించి భద్రపరిచే విధానాలను వివరించారు.
అలాగే ఘటనా స్థలానికి సంబంధించిన కచ్చితమైన స్కెచ్ తయారీ, సాక్షుల వాంగ్మూలాల నమోదు, సమర్థవంతమైన నేర పరిశోధనలో పాటించాల్సిన విధివిధానాలపై సిబ్బందితో చర్చించారు.
దర్యాప్తు ప్రమాణాలు పెంచేందుకు శిక్షణ :
క్షేత్రస్థాయిలో పోలీసు సిబ్బంది వృత్తిగత నైపుణ్యాలను, దర్యాప్తు ప్రమాణాలను పెంచేందుకు పరేడ్, శిక్షణ తరగతులు ఎంతగానో దోహదపడతాయని పోలవరం డీఎస్పీ జయకృష్ణ తెలిపారు. ప్రతి నేర దర్యాప్తులో సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించి, సాక్ష్యాలను పకడ్బందీగా సేకరించాలని సూచించారు.
కార్యక్రమంలో జీలుగుమిల్లి ఎస్సై వి. క్రాంతికుమార్, బుట్టాయగూడెం ఎస్సై చెన్నారావు, టి. నరసాపురం ఎస్సై జయబాబు, సర్కిల్ పరిధిలోని పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

