Kaikaluru Rural Circle : కైకలూరు రూరల్ సర్కిల్‌లో రోడ్డు ప్రమాదాల అరికట్టేందుకు ముమ్మర చర్యలు
రహదారి ప్రమాద రహిత జిల్లాగా ఏలూరును తీర్చిదిద్దడమే లక్ష్యంగా పోలీస్ యంత్రాంగం చర్యలు వేగవంతం చేసింది. ఏలూరు జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్, ఐపీఎస్ మరియు ఏలూరు డీఎస్పీ డి. శ్రావణ్ కుమార్ ఆదేశాల మేరకు నిన్న సోమవారం కైకలూరు రూరల్ ఇన్స్పెక్టర్ వి. రవికుమార్ పర్యవేక్షణలో సర్కిల్ పరిధిలో ప్రత్యేక భద్రతా కార్యక్రమాలు చేపట్టారు.
ఈ సందర్భంగా సీఐతో పాటు సర్కిల్ పరిధిలోని ఎస్సైలు ప్రత్యేక భద్రతా చర్యలపై మాట్లాడారు
సీఐ వి. రవికుమార్ మాట్లాడుతూ :
ప్రజల ప్రాణ రక్షణే ధ్యేయంగా కైకలూరు రూరల్ సర్కిల్ పరిధిలో ప్రమాద రహిత వాతావరణాన్ని ఏర్పాటు చేయడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని సీఐ తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠినంగా వ్యవహరిస్తూనే, ప్రతి ఒక్కరిలో రహదారి భద్రతపై బాధ్యత పెరిగేలా నిరంతరం క్షేత్రస్థాయి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ప్రజల రక్షణ కోసం పోలీసులు చేపడుతున్న చర్యలకు వాహనదారులు పూర్తిస్థాయిలో సహకరించాలని కోరారు.
కైకలూరు రూరల్ ఎస్సై రాంబాబు మాట్లాడుతూ :
రాత్రి వేళల్లో చీకటి కారణంగా జరిగే ఘోర ప్రమాదాలను అరికట్టేందుకు, వాహనాల వేగాన్ని కట్టడి చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. సర్కిల్ వ్యాప్తంగా ప్రమాదకర ప్రాంతాలు, రద్దీ రోడ్లపై 180 రేడియం స్టిక్కరింగ్ డ్రమ్స్‌ను ఏర్పాటు చేశామని, ఇవి చీకటిలో మెరుస్తూ వాహనదారులను ముందే అప్రమత్తం చేస్తాయని వివరించారు
కలిదిండి ఎస్సై పవన్ కుమార్ మాట్లాడుతూ :
గతంలో ఘోర ప్రమాదాలకు గురైన వాహనాలతో రెండు ప్రత్యేక డెమో పాయింట్లను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. నిబంధనలు పాటించకపోవడం వల్ల కలిగే ప్రాణ, ఆస్తి నష్టాలను కళ్ళకు కట్టినట్లు చూపిస్తూ వాహనదారుల్లో మార్పు తీసుకురావడమే ఈ డెమోల ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు.
మండవల్లి ఎస్సై రామచంద్ర రావు మాట్లాడుతూ :
రహదారి నిబంధనలపై క్షేత్రస్థాయిలో విస్తృత అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కార్లలో ప్రయాణించే వారు సీటు బెల్టు వాడాలని, ప్రయాణంలో ప్రతి ఒక్కరూ రహదారి నిబంధనలను విధిగా పాటించాలని సూచించారు.
ముదినేపల్లి ఎస్సై వీరభద్ర రావు మాట్లాడుతూ :
మద్యం తాగి వాహనాలు నడపడం, పరిమితికి మించి వేగంగా వెళ్లడం వల్ల జరిగే తీవ్ర ప్రమాదాలపై యువతకు ప్రత్యేక అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ దొరికితే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ప్రజా రక్షణే ధ్యేయంగా పనిచేస్తున్న పోలీస్ శాఖకు వాహనదారులు పూర్తిస్థాయిలో సహకరించి, సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సర్కిల్ పరిధిలోని పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
