Kalidindi : మట్టగుంటలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ.. విద్యార్థులతో కలిసి జాతీయ జెండా పట్టిన ఆండ్రాజు శ్రీనివాస్
ఏలూరు జిల్లా : కలిదిండి : మట్టగుంట : స్వచ్ఛవార్త :
“హర్ ఘర్ తిరంగా” కార్యక్రమంలో భాగంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని శుక్రవారం కలిదిండి మండలం మట్టగుంట గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, రాష్ట్ర అగ్నికుల క్షత్రియ వెల్ఫేర్ & డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ అండ్రాజు శ్రీనివాసరావు తదితరులు ఘనంగా తిరంగా ర్యాలీ నిర్వహించారు. జాతీయ జెండాలను చేతబూని, దేశభక్తి నినాదాలు చేస్తూ గ్రామంలో ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా అండ్రాజు శ్రీనివాసరావు మాట్లాడుతూ...
“హర్ ఘర్ తిరంగా” కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటా జాతీయ జెండా రెపరెపలాడుతూ దేశభక్తి, జాతీయ సమైక్యత స్ఫూర్తిని చాటాలని అన్నారు. స్వాతంత్ర్యం ఎందరో మహనీయుల త్యాగాల ఫలితంగా మనకు లభించిన అమూల్యమైన వారసత్వమని, వారి త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని అన్నారు.
ముఖ్యంగా విద్యార్థుల్లో చిన్ననాటి నుంచే దేశభక్తి, జాతీయ సమైక్యత, దేశ సేవ పట్ల బాధ్యతాభావాన్ని పెంపొందించాలని సూచించారు. హర్ ఘర్ తిరంగా కేవలం జెండాను ఇంటిపై ఎగురవేయడం మాత్రమే కాదని.. దేశం పట్ల మనకున్న గౌరవం, బాధ్యత, ఐక్యతను చాటడం అని అన్నారు. “దేశం మనకు ఏమిచ్చిందని ఆలోచించకుండా.. దేశానికి మనం ఏమి చేయగలమో ఆలోచించడమే నిజమైన దేశభక్తి. ప్రతి ఇంటిపై తిరంగా ఎగురవేద్దాం.. ప్రతి హృదయంలో దేశభక్తిని నింపుదాం. హర్ ఘర్ తిరంగా ద్వారా దేశ ఐక్యతను చాటుదాం” అని అన్నారు.
కార్యక్రమంలో ఒడుగు గణపతి, కోకా తాతయ్య, వాతాడి రాంబాబు, విద్యా కమిటీ చైర్మన్ కోపనాతి రాము, హెడ్మాస్టర్ శ్రీమతి ఈశ్వరమ్మ, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామ పెద్దలు, యువత తదితరులు పాల్గొన్నారు.


