Kalidindi : కలిదిండిలో సీఎం చంద్రబాబు పర్యటన సక్సెస్ : ఏఎంసి చైర్మన్ కూరేళ్ళ ఏడుకొండలు
ఏలూరు జిల్లా : కలిదిండి : స్వచ్ఛవార్త :
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలిదిండి పర్యటన అత్యంత వైభవంగా, విజయవంతంగా ముగిసిందని కలిదిండి వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసి) చైర్మన్ కూరేళ్ళ ఏడుకొండలు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. 'మీ భూమి - మీ హక్కు' కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి వర్గాల వారీగా సమస్యలు తెలుసుకుని, దశాబ్దాల నాటి భూ సమస్యలకు అక్కడికక్కడే పరిష్కారం చూపడం శుభపరిణామమని పేర్కొన్నారు.
22-A భూ చిక్కులకు స్వస్తి :
గత ఎనిమిది దశాబ్దాలుగా ఉన్న 22-A నిషేధిత భూ సమస్యలను పరిష్కరించి, బాధితులకు ‘రాజముద్ర’తో కూడిన పట్టాదారు పాసుపుస్తకాలను పంపిణీ చేయడం చారిత్రాత్మక నిర్ణయమని ఏఎంసి చైర్మన్ కొనియాడారు. ముఖ్యమంత్రి నేరుగా ప్రజల వద్దకు వచ్చి సమస్యలు పరిష్కరించడం ద్వారా రైతులలో, మాజీ సైనికులలో నూతనోత్సాహం నిండిందన్నారు.
ఆక్వా రైతులకు ఊరట :
ప్రాంతీయంగా ఎంతో ప్రాముఖ్యత ఉన్న ఆక్వా రంగాన్ని ఆదుకునేందుకు ఆక్వా రైతులకు రూ. 1.50లకే విద్యుత్ సరఫరాను కొనసాగించడం ప్రభుత్వం రైతాంగం పట్ల చూపుతున్న నిబద్ధతకు నిదర్శనమని చెప్పారు. నిరంతరం రైతు సంక్షేమం కోసం పరితపించే ఇటువంటి ప్రభుత్వం కొనసాగడం రాష్ట్ర ప్రజల అదృష్టమని వ్యాఖ్యానించారు.
అధికారులు, నాయకులకు ధన్యవాదాలు :
ఈ భారీ పర్యటనను సమర్థవంతంగా నిర్వహించడంలో సహకరించిన మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి, ఎస్పీ కే. ప్రతాప్ శివకిషోర్ మరియు ఇతర శాఖల అధికారులకు ఏడుకొండలు ధన్యవాదాలు తెలిపారు. అలాగే, కైకలూరు ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీనివాస్, కలిదిండి టిడిపి మండల అధ్యక్షుడు వల్లభనేని శ్రీనివాస చౌదరి, మాజీ అధ్యక్షుడు పోకల జోగిరాజు, ఎన్డీయే కూటమి నాయకులు, కార్యకర్తల శ్రమ అభినందనీయమని పేర్కొన్నారు.
