Kalidindi : విద్యార్థులకు సైబర్ నేరాలు, ట్రాఫిక్ మరియు వ్యక్తిత్వ వికాసంపై అవగాహన
ఏలూరు జిల్లా : కలిదిండి : స్వచ్ఛవార్త :
ప్రభుత్వ జూనియర్ కళాశాల, కలిదిండిలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఈ రోజు పోలీసుల ఆధ్వర్యంలో వివిధ సమకాలీన అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా సైబర్ నేరాల తాజా ధోరణులు, ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు ప్రమాదాలకు గల ప్రధాన కారణాలు, POCSO చట్టం మరియు బాలల రక్షణ, టీనేజ్ వయస్సులో ఎదురయ్యే సమస్యలు, ప్రేమ పేరుతో జరిగే మోసాలు (Love Traps), ఆన్‌లైన్ గేమ్స్ వల్ల కలిగే దుష్ప్రభావాలు, సోషల్ మీడియా వినియోగం, విద్యార్థుల ప్రవర్తన మరియు వ్యక్తిత్వ పరిరక్షణ తదితర అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.
విద్యార్థులు సైబర్ మోసాలకు గురికాకుండా అపరిచిత లింకులు, ఫోన్ కాల్స్, మెసేజ్‌లు మరియు సోషల్ మీడియా పరిచయాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వాహనాలు నడిపే సమయంలో తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, మద్యం సేవించి లేదా అజాగ్రత్తగా వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని వివరించారు.
అదేవిధంగా, టీనేజ్ వయస్సులో భావోద్వేగ నిర్ణయాలకు దూరంగా ఉండి, విద్య, లక్ష్య సాధన మరియు మంచి భవిష్యత్తుపై దృష్టి సారించాలని సూచించారు. ఆన్‌లైన్ గేమ్స్, సోషల్ మీడియా మరియు చెడు స్నేహాల ప్రభావానికి లోనుకాకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మరియు పోలీసుల సూచనలు పాటించాలని తెలిపారు.
విద్యార్థులు తమ భద్రత, క్రమశిక్షణ, మంచి ప్రవర్తన మరియు వ్యక్తిత్వాన్ని కాపాడుకోవడంతో పాటు బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగాలని పోలీసులు ఆకాంక్షించారు.
