Kamavarapukota : తడికలపూడిలో తాగునీటికి తహ తహ.. వాటర్ ట్యాంకర్లే దిక్కు..!
ఏలూరు జిల్లా : కామవరపుకోట : స్వచ్ఛవార్త :
తడికలపూడి పంచాయతీ పరిధిలోని ఎస్సీ కాలనీ నాగుల చెరువు గట్టు వద్ద ఉన్న మంచినీటి మోటార్ కేబుల్ వైరు పాడై సుమారు పది రోజులు గడుస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడంతో తాగునీటి ఎద్దడి తీవ్రరూపం దాల్చింది. నీటి సరఫరా నిలిచిపోవడంతో కాలనీవాసులు నీటి కోసం తీవ్ర అవస్థలు పడుతున్నారు.
మోటార్ పునరుద్ధరణకు నానాటికీ ఆలస్యం అవుతుండటంతో, పంచాయతీ సరఫరా చేసే వాటర్ ట్యాంకర్ల వద్ద లేదా స్వచ్ఛందంగా తెప్పించే ట్యాంకర్ల వద్ద పెద్ద ఎత్తున బిందెలు, డ్రమ్ములు పట్టుకుని క్యూ లైన్లలో నిలబడాల్సిన దుస్థితి ఏర్పడింది. గంటల తరబడి వేచి ఉండి వాటర్ ట్యాంకర్ల నుండి నీటిని పట్టుకుంటూ కాలనీ ప్రజలు తీవ్ర నరకయాతన అనుభవిస్తున్నారు.
ఈ సమస్యను పది రోజులుగా పరిష్కరించకుండా నిర్లక్ష్యం వహించడంపై పంచాయతీ అధికారుల తీరుపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి, మోటార్ కేబుల్‌ను బాగు చేయించి పైప్‌లైన్ ద్వారా తాగునీటి సరఫరాను పునరుద్ధరించాలని కాలనీవాసులు విజ్ఞప్తి చేస్తున్నారు.

