Machilipatnam : 11 రోజుల పాటు ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. మంత్రి కొల్లు రవీంద్ర అధ్యక్షతన ఉత్సవ కమిటీ ఏర్పాటు
మంగినపూడి బీచ్‌లో 63 అడుగుల మట్టి మహాగణపతి...
కృష్ణాజిల్లా : మచిలీపట్నం : స్వచ్ఛవార్త :
రానున్న వినాయక చవితి సందర్భంగా మచిలీపట్నం మంగినపూడి బీచ్‌లో 63 అడుగుల మట్టి మహాగణపతిని ఏర్పాటు చేసి 11 రోజుల పాటు ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఖైరతాబాద్ తరహాలో భారీ మట్టి వినాయక విగ్రహంతో పాటు వివిధ ఉపాలయాలను ఏర్పాటు చేయనున్నారు.
ఉత్సవాల నిర్వహణపై చర్చించేందుకు కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయ సమావేశపు హాల్‌లో మంత్రి కొల్లు రవీంద్ర అధ్యక్షతన ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సాగరతీర మహాగణపతి ఉత్సవ సేవా సమితి, మంగినపూడి, మచిలీపట్నం’ కమిటీని ఏర్పాటు చేశారు.
18 మందితో ఉత్సవ కమిటీ :
ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి, కోశాధికారి, కార్య నిర్వాహక కార్యదర్శి, కార్యదర్శితో పాటు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశారు. అధ్యక్షుడిగా చలమలశెట్టి నరసింహారావు, ఉపాధ్యక్షుడిగా తాడేపల్లి మెహర్ బాబా, ప్రధాన కార్యదర్శిగా వేమూరి బాల రత్నం, కోశాధికారిగా కొమరగిరి చంద్రశేఖర్, కార్య నిర్వాహక కార్యదర్శిగా డా. ధన్వంతరి ఆచార్య, కార్యదర్శిగా బొర్రా శ్రీనివాసరావును నియమించారు.
అభివృద్ధికి ఆటంకం లేకుండా ఉత్సవాలు :
ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ..
మచిలీపట్నం బీచ్‌ను భవిష్యత్తులో మరింత అభివృద్ధి చేసి ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. బీచ్‌లో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలకు ఎలాంటి ఆటంకం కలగకుండా, భక్తులు, పర్యాటకులకు ఇబ్బందులు లేకుండా పక్కా ప్రణాళికతో ఉత్సవాలను నిర్వహించాలని సూచించారు.
63 అడుగుల మట్టి మహాగణపతి ఏర్పాటు ...
మంగినపూడి బీచ్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని, దీనివల్ల స్థానికంగా పర్యాటక రంగానికి మరింత ఊతం లభిస్తుందని మంత్రి తెలిపారు. 11 రోజుల పాటు జరిగే ఉత్సవాలకు వచ్చే భక్తులు, పర్యాటకులకు అవసరమైన సౌకర్యాలను సమన్వయంతో కల్పించాలని కమిటీ సభ్యులకు సూచించారు.
పర్యాటక అభివృద్ధికి దోహదపడేలా..
మంగినపూడి బీచ్ పర్యాటక అభివృద్ధికి ఎలాంటి ఆటంకం కలగకుండా పర్యావరణహితంగా 63 అడుగుల మట్టి మహాగణపతిని ఏర్పాటు చేసి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని కమిటీ సభ్యులు తెలిపారు. భక్తులు, పర్యాటకులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేపడతామని పేర్కొన్నారు.
కార్యక్రమంలో జనసేన పార్టీ టౌన్ పార్టీ అధ్యక్షుడు గడ్డం రాజు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పలపాటి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.
మచిలీపట్నం సాగరతీరంలో భక్తి, ఆధ్యాత్మికతతో పాటు పర్యాటక ఆకర్షణను కలగలిపేలా ఈసారి వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి.
