Machilipatnam : రైతులు పంట బీమా తప్పనిసరిగా చేయించుకోవాలి : జిల్లా కలెక్టర్ డీకే బాలాజి
నీటి కొరతను దృష్టిలో ఉంచుకుని రైతులు ముందస్తు ప్రణాళికతో సాగు చేయాలి...
కృష్ణా జిల్లా : మచిలీపట్నం : స్వచ్ఛవార్త :
నీటి లభ్యతపై అనిశ్చిత పరిస్థితులు ఉన్న నేపథ్యంలో రైతులు ముందస్తు ప్రణాళికతో వ్యవసాయం చేపట్టాలని, ప్రతి రైతు తప్పనిసరిగా పంట బీమా చేయించుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజి సూచించారు.
సోమవారం సాయంత్రం కలెక్టరేట్‌లోని తన చాంబర్ నుంచి రైతులను ఉద్దేశించి వీడియో సందేశం విడుదల చేసిన కలెక్టర్ మాట్లాడుతూ, ఈ ఏడాది సూపర్ ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం తక్కువగా నమోదైందని, కాలువల ద్వారా నీటి సరఫరా కూడా పరిమితంగా ఉండే అవకాశం ఉందని తెలిపారు. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రబీ పంటల సాగుపై రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంట దిగుబడి తగ్గే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాది పంట బీమా అత్యంత కీలకమని కలెక్టర్ పేర్కొన్నారు. రైతులు పంట బీమా చేయించుకోవడం ద్వారా నష్టాల నుంచి ఆర్థిక రక్షణ పొందవచ్చని చెప్పారు.
పంట రుణాలు తీసుకునే రైతులు సంబంధిత బ్యాంకుల ద్వారా, ఇతర రైతులు గ్రామ, వార్డు సచివాలయాలు లేదా సహకార సంఘాల ద్వారా పంట బీమా నమోదు చేసుకోవచ్చని తెలిపారు. ప్రతి రైతు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తప్పనిసరిగా పంట బీమా చేయించుకోవాలని, తద్వారా ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగే నష్టాలను ఎదుర్కొనే భరోసా పొందాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు.
