Machilipatnam : పీఎం ఇంటర్న్‌షిప్ పథకాన్ని మరింత విస్తృతంగా అమలు చేసేందుకు కేంద్రం చర్యలు – ఎంపీ వల్లభనేని బాలశౌరి
మచిలీపట్నం/న్యూ ఢిల్లీ : స్వచ్ఛవార్త :
మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి అడిగిన ప్రశ్నకు కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ లోక్‌సభలో సమాధానం ఇచ్చింది. 2024-25 బడ్జెట్‌లో ప్రకటించిన ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్ పథకం (PM Internship Scheme) ప్రస్తుతం పైలట్ ప్రాజెక్టు రూపంలో కొనసాగుతోందని, ప్రధాన పథకం ఇంకా ప్రారంభం కాలేదని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
కేంద్ర ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం, 2024 అక్టోబర్ 3న ప్రారంభమైన పైలట్ ప్రాజెక్టులో ఇప్పటివరకు రెండు దశలు పూర్తికాగా, మూడో దశ ప్రస్తుతం కొనసాగుతోంది. అమలు సమయంలో వచ్చిన అనుభవాల ఆధారంగా 2026 మార్చి 12న మార్గదర్శకాలను సవరించారు.
సవరించిన మార్గదర్శకాల ప్రకారం :
* ఇంటర్న్‌షిప్ వ్యవధిని కంపెనీల అవసరాలకు అనుగుణంగా 6 లేదా 9 నెలలుగా నిర్ణయించారు.
* నెలవారీ స్టైపెండ్‌ను రూ.5,000 నుంచి రూ.9,000కు పెంచారు.
* అర్హత వయస్సును 21–24 సంవత్సరాల నుంచి 18–25 సంవత్సరాలకు విస్తరించారు.
* మాస్టర్స్ పూర్తిచేసిన వారు, గ్రాడ్యుయేషన్/పోస్ట్‌గ్రాడ్యుయేషన్ చివరి సంవత్సరం విద్యార్థులకు కూడా అవకాశం కల్పించారు.
* పథకంలో పాల్గొనే కంపెనీలు, సంస్థల పరిధిని విస్తరించారు.
* నిరంతర ఇంటర్న్‌షిప్ ఎంపికలు జరిగేలా రోలింగ్ ఇంటర్న్‌షిప్ విధానాన్ని ప్రవేశపెట్టారు.
* పోర్టల్‌లో జియో-ట్యాగింగ్, ఖాళీల బదిలీ, అదనపు ప్రయోజనాల వివరాల ప్రదర్శన వంటి కొత్త సదుపాయాలను అందుబాటులోకి తీసుకువచ్చారు. అలాగే రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు మరియు పరిశ్రమల సంఘాల సహకారంతో అవగాహన కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
బడ్జెట్ వివరాల ప్రకారం, పీఎం ఇంటర్న్‌షిప్ పథకానికి 2024-25లో రూ.2,000 కోట్లు, 2025-26లో రూ.10,831.07 కోట్లు, 2026-27లో రూ.4,788.45 కోట్లు కేటాయించినప్పటికీ, ప్రధాన పథకం ఇంకా ప్రారంభం కాకపోవడంతో ప్రస్తుతం పైలట్ ప్రాజెక్టు మాత్రమే అమలులో ఉందని ప్రభుత్వం పేర్కొంది.
ఆంధ్రప్రదేశ్‌లో పీఎం ఇంటర్న్‌షిప్ పైలట్ ప్రాజెక్టు పురోగతిపై కూడా కేంద్రం వివరాలు వెల్లడించింది. 2026 జూలై 15 నాటికి:
* రౌండ్–1: 4,973 ఇంటర్న్‌షిప్ అవకాశాలకు గాను 6,164 ఆఫర్లు ఇవ్వగా 1,970 మంది అంగీకారం తెలిపి 411 మంది చేరినట్లు
* రౌండ్–2 లో 4,715 అవకాశాలకుగాను , 11,095 ఆఫర్లు ఇవ్వగా 2,870 మంది అంగీకారం తెలిపి 650 మంది చేరినట్లు
* రౌండ్–3 లో 6,384 అవకాశాలకు గాను 1,520 ఆఫర్లు ఇవ్వగా 848 మంది అంగీకారం తెలిపి 556 మంది చేరికలు నమోదు అయినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ప్రస్తుతం మూడో దశ కొనసాగుతోందని తెలిపింది.
ఈ పథకం ద్వారా యువతకు పరిశ్రమల్లో ప్రత్యక్ష అనుభవం, ఉపాధి అవకాశాలు పెరగనున్న నేపథ్యంలో, పథకాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేయాలని ఎంపీ శ్రీ వల్లభనేని బాలశౌరి కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లారు.
