Machilipatnam : నిరుపేదలకు అండగా నిలవడం అభినందనీయం : కృష్ణా జిల్లా విద్యాశాఖ అధికారి వై. సుబ్బారావు
బెరాకా మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో 36 మంది లబ్ధిదారులకు రూ.16.78 లక్షల ఆర్థిక సాయం...
కృష్ణా జిల్లా : మచిలీపట్నం : స్వచ్ఛవార్త :
ఆర్థిక ఇబ్బందులతో విద్యకు దూరమవుతున్న ప్రతిభావంతులైన విద్యార్థులకు చేయూతనందించడంతో పాటు వైద్యం, గృహ నిర్మాణం వంటి అత్యవసర అవసరాలకు నిరుపేదలకు అండగా నిలుస్తున్న బెరాకా మినిస్ట్రీస్ సేవా కార్యక్రమాలు అభినందనీయమని కృష్ణా జిల్లా విద్యాశాఖ అధికారి వి. సుబ్బారావు అన్నారు. బెరాకా మినిస్ట్రీస్ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో 36 మంది లబ్ధిదారులకు రూ.16 లక్షల 78 వేల విలువైన ఆర్థిక సహాయం, చెక్కులు, ల్యాప్‌టాప్‌లు, నిత్యావసర సరుకులు తదితర సామగ్రిని అందజేశారు.
బెరాకా మినిస్ట్రీస్ అధినేత డాక్టర్ బి.ఎస్. కిరణ్ పాల్ సహకారంతో ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో విద్యా అవసరాల కోసం రూ.10 లక్షల 37 వేల, వైద్య సహాయం కోసం రూ.1 లక్ష 40 వేల, గృహ నిర్మాణ అవసరాల కోసం రూ.5 లక్షల 2 వేల విలువైన సహాయాన్ని లబ్ధిదారులకు అందించారు.
ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా పాల్గొన్న జిల్లా విద్యాశాఖ అధికారి వై. సుబ్బారావు, మాజీ గ్రంథాలయ చైర్మన్ గొర్రెపాటి గోపీచంద్ మాట్లాడుతూ.. పేదరికం కారణంగా ప్రతిభావంతులైన విద్యార్థులు చదువుకు దూరం కాకుండా ఆర్థిక సహాయం అందించడం గొప్ప సేవా కార్యక్రమమని పేర్కొన్నారు. సమాజంలోని ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు అండగా నిలిచి, వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు బెరాకా మినిస్ట్రీస్ చేస్తున్న కృషి స్ఫూర్తిదాయకమన్నారు. భవిష్యత్తులోనూ డాక్టర్ బి.ఎస్. కిరణ్ పాల్ సహకారంతో మరింత మంది నిరుపేదలకు సేవా కార్యక్రమాలను విస్తృతంగా కొనసాగించాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షుడు లోగిశెట్టి వెంకటస్వామి, సీనియర్ జర్నలిస్ట్, వెలుగు ఫౌండేషన్ అధ్యక్షుడు చందమామ బాబు, చిన్నం శివ, గండికోట అంజిబాబు, బెరాకా మినిస్ట్రీస్ సభ్యులు అడపా గణేష్, సాయి, భార్గవి తదితరులు పాల్గొన్నారు.
