MACHILIPATNAM : నాలుగు రెస్టారెంట్లలో మున్సిపల్ ఆరోగ్య శాఖ తనిఖీలు.. పత్రాలు లేకుండా నిర్వహణ, పారిశుద్ధ్య లోపాలు గుర్తింపు
కృష్ణా జిల్లా : మచిలీపట్నం : స్వచ్ఛవార్త :
మున్సిపల్ ఆరోగ్య శాఖ[మచిలీపట్నం నగర పాలక సంస్థ] ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక 4 రెస్టారెంట్లను తనిఖీలు చేశారు. తనిఖీలో భాగంగా సంబంధిత సంస్థలు నిర్వహణకు అవసరమైన మున్సిపల్ ట్రేడ్ లైసెన్స్, FSSAI లైసెన్స్/రిజిస్ట్రేషన్ తదితర అవసరమైన పత్రాలను అధికారులు తనిఖీ సమయంలో సమర్పించలేకపోయినట్లు గుర్తించారు.
తనిఖీల్లో కొన్ని రెస్టారెంట్లలో పారిశుద్ధ్య లోపాలు, ఈగలు, దోమలు, ఆహార పదార్థాల సక్రమమైన నిల్వ లేకపోవడం మరియు గడువు ముగిసిన ఆహార పదార్థాలు కూడా గుర్తించబడ్డాయి. ఒక రెస్టారెంట్‌లో బహిరంగంగా కట్టెలు కాల్చి వంట చేయడం ద్వారా పొగ, బూడిద మరియు దుర్వాసన పరిసర ప్రాంతాల్లో వ్యాపిస్తున్నట్లు గుర్తించారు.
ప్రజారోగ్యానికి హాని కలిగించే విధంగా మరియు అవసరమైన అనుమతులు/పత్రాలు లేకుండా ఆహార వ్యాపారం నిర్వహిస్తే వర్తించే మున్సిపల్ చట్టాలు, లైసెన్స్ నిబంధనలు, ఆహార భద్రతా నిబంధనల ప్రకారం కఠినమైన చర్యలు తీసుకుంటామని మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ అడపా సుబ్రహ్మణ్యం హెచ్చరించారు.
తనిఖీ సందర్భంగా సంబంధిత నిర్వాహకులకు నోటీసులు జారీ చేసి, అవసరమైన పత్రాలను సమర్పించడంతో పాటు, గుర్తించిన అన్ని పారిశుద్ధ్య మరియు ఆహార భద్రతా లోపాలను తక్షణమే సరిదిద్దాలని ఆదేశించారు. ఆహార భద్రతకు సంబంధించిన అంశాలను సంబంధిత Food Safety Authority దృష్టికి తీసుకెళ్లి, అవసరమైన తదుపరి చర్యలు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు.
ప్రజారోగ్య పరిరక్షణలో భాగంగా హోటళ్లు, రెస్టారెంట్లు మరియు ఇతర ఆహార విక్రయ కేంద్రాలపై తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని, నిబంధనలు ఉల్లంఘించే సంస్థలపై ఎటువంటి ఉపేక్ష లేకుండా చర్యలు తీసుకుంటామని MHO అడపా సుబ్రహ్మణ్యం తెలిపారు.
