Medikonduru : జంపాన శ్రీనివాస గౌడ్ ఫిర్యాదుతో మెడికొండూరు ఘటనపై విచారణకు ఆదేశాలు
అమరావతి/గుంటూరు : మెడికొండూరు : స్వచ్ఛవార్త :
మెడికొండూరు పోలీస్‌స్టేషన్ తనిఖీ సందర్భంగా రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్‌కు అడ్డంకులు కల్పించారన్న ఆరోపణలపై విచారణ జరిపి, నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర హోంశాఖ ఆదేశించింది. విజయవాడకు చెందిన యూఎఫ్‌ఆర్‌టీఐ కార్యకర్త జంపాన శ్రీనివాస గౌడ్ సమర్పించిన ఫిర్యాదు నేపథ్యంలో హోంశాఖ ఈ చర్యలు చేపట్టింది.
జంపాన శ్రీనివాస గౌడ్ జూలై 15న సమర్పించిన ఫిర్యాదు జూలై 21న హోంశాఖకు అందింది. మెడికొండూరు పోలీస్‌స్టేషన్ తనిఖీ సమయంలో రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్‌కు అడ్డంకులు కల్పించినట్లు పేర్కొంటూ, ఈ ఘటనపై విచారణ జరిపించాలని ఆయన ఫిర్యాదులో కోరారు.
డీజీపీకి విచారణ బాధ్యతలు :
జంపాన శ్రీనివాస గౌడ్ ఫిర్యాదును పరిశీలించిన హోంశాఖ దాని ప్రతిని ఆంధ్రప్రదేశ్ డీజీపీకి పంపించింది. ఆరోపణలపై సమగ్రంగా విచారణ జరిపి వాస్తవాలను నిర్ధారించాలని, అనంతరం అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం అవసరమైన తదుపరి చర్యలు చేపట్టాలని డీజీపీని ఆదేశించింది. ఈ మేరకు హోంశాఖ ప్రధాన కార్యదర్శి కుమార్ విశ్వజీత్ జూలై 24న మెమో జారీ చేశారు.
ఫిర్యాదులో పేర్కొన్న అంశాలపై సంబంధిత అధికారుల నుంచి వివరాలు సేకరించి, ఘటనకు సంబంధించిన వాస్తవ పరిస్థితులను నిర్ధారించిన అనంతరం నిబంధనల ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉంది. పోలీసు ఉన్నతాధికారుల విచారణ నివేదిక ఆధారంగా తదుపరి నిర్ణయం వెలువడనుంది.
![]() |
| జంపాన శ్రీనివాసగౌడ్ |
చట్టంపై నమ్మకం ఉంది :
హోంశాఖ ఆదేశాలపై యూఎఫ్‌ఆర్‌టీఐ కార్యకర్తలు జంపాన శ్రీనివాస గౌడ్, బేతపూడి జోగేశ్వరరావు, బొల్లా శివపార్వతి హర్షం వ్యక్తం చేశారు. చట్టంపై తమకు పూర్తి నమ్మకం ఉందని, విచారణ అనంతరం అనుకూల ఫలితం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.


