T. Narasapuram : విద్యార్థుల్లో రహదారి భద్రత, సైబర్ నేరాలపై అవగాహన పెరగాలి : ఎస్‌ఐ జయబాబు
ఏలూరు జిల్లా : టి. నరసాపురం : స్వచ్ఛవార్త :
విద్యార్థి దశ నుంచే రహదారి భద్రత, సైబర్ నేరాల నివారణ, మహిళలు, బాలికల రక్షణపై అవగాహన పెంపొందించడం అత్యంత అవసరమని టి. నరసాపురం ఎస్‌ఐ జయబాబు అన్నారు. ఏలూరు జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ ఆదేశాల మేరకు, పోలవరం డీఎస్పీ జయకృష్ణ, జీలుగుమిల్లి సీఐ యాదగిరి పర్యవేక్షణలో స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎస్‌ఐ జయబాబు మాట్లాడుతూ..
ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం, ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్ ధరించకపోవడం వల్లే ఎక్కువ రహదారి ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. విద్యార్థులు ఇప్పటి నుంచే ట్రాఫిక్ నియమాలపై అవగాహన పెంచుకుని, కుటుంబ సభ్యులకు కూడా వాటి ప్రాముఖ్యతను తెలియజేయాలని సూచించారు.
సోషల్ మీడియా ద్వారా జరిగే సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అపరిచితుల నుంచి వచ్చే ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు, సందేశాలు, లింకులను నమ్మవద్దని సూచించారు. వ్యక్తిగత వివరాలు, ఓటీపీలు, బ్యాంకు సమాచారం ఎవరికీ పంచుకోవద్దని హెచ్చరించారు.
అదేవిధంగా మహిళలు, బాలికల భద్రత, పోక్సో చట్టం, గుడ్ టచ్–బ్యాడ్ టచ్ అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఎలాంటి అనుమానాస్పద సంఘటనలు జరిగినా వెంటనే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా పోలీసులను సంప్రదించాలని సూచించారు.
కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

