T. Narasapuram : అంగన్‌వాడీ, ప్రాథమిక పాఠశాలలో రికార్డుల నిర్వహణపై విజిలెన్స్ కమిటీ సభ్యుడి ఆగ్రహం
ఏలూరు జిల్లా : టి. నరసాపురం : స్వచ్ఛవార్త :
మండలంలోని గండిగూడెం గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రం, ప్రాథమిక పాఠశాలను విజిలెన్స్ కమిటీ సభ్యుడు డాక్టర్ వంటిపల్లి విజయకృష్ణ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ, రికార్డుల నమోదు తీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.
తొలుత ప్రాథమిక పాఠశాలను సందర్శించిన విజయకృష్ణ రికార్డులను పరిశీలించారు. గత కొన్ని రోజులుగా బియ్యం, గుడ్లు, చిక్కీలు తదితర సరుకుల నిల్వ, వినియోగానికి సంబంధించిన వివరాలను రికార్డుల్లో నమోదు చేయకపోవడంపై సిబ్బందిని ప్రశ్నించారు. రికార్డుల నిర్వహణ ప్రధానోపాధ్యాయులు చూసుకుంటారని, ప్రస్తుతం ఆయన సెలవులో ఉన్నారని సిబ్బంది చెప్పడంతో విజిలెన్స్ కమిటీ సభ్యులు, గ్రామస్థులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
అంగన్‌వాడీ కేంద్రంలోనూ రికార్డులపై అసంతృప్తి :
అనంతరం అంగన్‌వాడీ కేంద్రాన్ని తనిఖీ చేయగా అక్కడ హెల్పర్‌తో పాటు కొంతమంది పిల్లలు మాత్రమే ఉన్నారు. నెలల తరబడి రికార్డులు నమోదు చేయకపోవడం, బాలింతలు, ఇతర లబ్ధిదారుల వివరాలు అందుబాటులో లేకపోవడం, చివరకు పిల్లల హాజరును కూడా నమోదు చేయకపోవడంపై విజయకృష్ణ అసహనం వ్యక్తం చేశారు.
రికార్డులు రాయొద్దని చెప్పారని, అంగన్‌వాడీ వర్కర్ అప్పుడప్పుడు వచ్చి ఫోన్‌లో వివరాలు నమోదు చేసుకుంటారని హెల్పర్ చెప్పినట్లు తెలిపారు.
బాధ్యులపై చర్యలు :
స్థానికుల ఫిర్యాదుల మేరకే అంగన్‌వాడీ, ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసినట్లు డాక్టర్ వంటిపల్లి విజయకృష్ణ తెలిపారు. మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ, రికార్డుల నమోదు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకునేలా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని ఆయన పేర్కొన్నారు.
