Vijayawada : 629 ఏఈఈ పోస్టులకు 1.05 లక్షల మంది దరఖాస్తు
23 నుంచి ఏఈఈ నియామక పరీక్షలు.. పారదర్శకంగా నిర్వహణ...
ఎన్టీఆర్ జిల్లా : విజయవాడ : స్వచ్ఛవార్త :
రాష్ట్ర విద్యుత్ సంస్థల్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్) పోస్టుల భర్తీకి ఈ నెల 23 నుంచి 27 వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు (సీబీటీ) నిర్వహించనున్నట్లు ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పి. పుల్లారెడ్డి తెలిపారు. 629 ఏఈఈ పోస్టులకు సుమారు 1.05 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు శుక్రవారం ఆయన ఓ ప్రకటనలో వెల్లడించారు.
పరీక్షలను పూర్తి పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు సీఎండీ తెలిపారు. రోజుకు రెండు షిఫ్టుల్లో పరీక్షలు జరుగుతాయని చెప్పారు. మొదటి షిఫ్ట్ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో షిఫ్ట్ మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు నిర్వహించనున్నట్లు వివరించారు.
గుర్తింపు కార్డు తప్పనిసరి :
అభ్యర్థులు ఒరిజినల్ హాల్‌టికెట్‌తో పాటు ఆధార్, పాన్, ఓటర్ ఐడీ, పాస్‌పోర్ట్ లేదా డ్రైవింగ్ లైసెన్స్‌లో ఏదో ఒక ఫొటో గుర్తింపు కార్డును తప్పనిసరిగా తీసుకురావాలని సూచించారు. పరీక్షా కేంద్రాల్లో ఫేస్ వెరిఫికేషన్‌తో పాటు మెటల్ డిటెక్టర్ల ద్వారా తనిఖీలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదు :
పరీక్షా కేంద్రాల్లో మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచీలు, కాలిక్యులేటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలతో పాటు పుస్తకాలు, కాగితాలను అనుమతించబోమని పుల్లారెడ్డి స్పష్టం చేశారు.
ఉద్యోగం ఇప్పిస్తామంటూ దళారులు చేసే ప్రచారాన్ని అభ్యర్థులు నమ్మవద్దని, ఏఈఈ నియామక పరీక్షలకు సంబంధించి అధికారిక ప్రకటనలను మాత్రమే విశ్వసించాలని సీఎండీ సూచించారు.
