Bhimavaram : స్థానిక ఎన్నికల్లో కూటమి 100 శాతం విజయం సాధించాలి : కేఎన్ఆర్
టీడీపీ సర్వసభ్య సమావేశంలో కేఎన్ఆర్ శ్రేణులకు దిశానిర్దేశం..
పశ్చిమగోదావరి జిల్లా : భీమవరం : స్వచ్ఛవార్త :
పశ్చిమగోదావరి జిల్లా నూతన జిల్లా పరిషత్ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంతో పాటు భీమవరంలో శుక్రవారం నిర్వహించిన టీడీపీ సర్వసభ్య సమావేశంలో రాష్ట్ర టీడీపీ కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు (కేఎన్ఆర్) పాల్గొన్నారు. సమావేశంలో పార్టీ శ్రేణులతో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించారు
ఈ సందర్భంగా కేఎన్ఆర్ మాట్లాడుతూ..
సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించినప్పటికీ, అసలైన పరీక్ష రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలేనని అన్నారు. అధిష్ఠానం ఆదేశాల మేరకు భీమవరం నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేసి ఎన్నికలకు సమాయత్తం చేయడానికే ఈ ఫీడ్‌బ్యాక్ సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. భీమవరం మున్సిపాలిటీలో వార్డుల సంఖ్య 58కి పెరిగే అవకాశం ఉన్నందున వార్డులు, మండలాల వారీగా బలమైన అభ్యర్థుల సమాచారాన్ని సిద్ధం చేసుకోవాలని సూచించారు.
పొత్తు ధర్మానికి కట్టుబడి ఉంటామని చెబుతూనే, గతంలో బీజేపీకి ఎంపీ, జనసేనకు ఎమ్మెల్యే స్థానాలను కేటాయించి గెలిపించుకున్నామని గుర్తుచేశారు. ఈసారి భీమవరం మున్సిపాలిటీతో పాటు రెండు ఎంపీపీ, రెండు జడ్పీటీసీ స్థానాలను టీడీపీకే కేటాయించాలని సమన్వయ కమిటీలో డిమాండ్ చేస్తామని పేర్కొన్నారు. నాయకులు, కార్యకర్తలు వర్గ విభేదాలు, ఈగోలను పక్కనబెట్టి, క్రియాశీలకంగా లేని నాయకులను సైతం కలుపుకుని సమష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. టీడీపీ, జనసేన, బీజేపీ సమన్వయంతో పనిచేసి స్థానిక ఎన్నికల్లో 100 శాతం విజయం సాధించేలా కృషి చేయాలని కేఎన్ఆర్ ఆకాంక్షించారు.
