Bhimavaram : దివంగత పోలీసు కుటుంబాలకు ఆర్థిక భరోసా.. సంక్షేమ నిధుల చెక్కులు అందజేసిన ఎస్పీ నయీం అస్మి
పశ్చిమగోదావరి జిల్లా : భీమవరం : స్వచ్ఛవార్త :
విధి నిర్వహణలో అకాల మరణం చెందిన పోలీసు సిబ్బంది కుటుంబాలకు పోలీసు శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి తెలిపారు. గొల్లలకోడేరులోని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో ఇటీవల మృతిచెందిన ఇద్దరు పోలీసు సిబ్బంది కుటుంబాలకు సంక్షేమ నిధుల నుంచి మంజూరైన ఆర్థిక సహాయాన్ని అందజేశారు.
భీమవరం టూ టౌన్ పోలీసు స్టేషన్‌లో విధులు నిర్వహిస్తూ జూలై 9న మృతిచెందిన పీసీ-1527 ఎస్.వి.వి.ఎస్. కృష్ణారావు భార్య సుంకర సత్యదుర్గకు విడో వెల్ఫేర్ ఫండ్ నుంచి మంజూరైన రూ.లక్ష చెక్కును ఎస్పీ అందజేశారు. అలాగే పశ్చిమగోదావరి జిల్లా నుంచి పెదవేగి డీటీసీలో విధులు నిర్వహిస్తూ ఆగస్టు 7న మృతిచెందిన ఏఆర్ పీసీ-2759 జి. విజయకృష్ణ భార్య జి. ఉషకు డిసీజ్డ్ వెల్ఫేర్ ఫండ్ నుంచి మంజూరైన మరో రూ.లక్ష చెక్కును అందించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ..
ఆపత్కాలంలో బాధిత కుటుంబాలకు తక్షణ ఆర్థిక భరోసా కల్పించేందుకు శాఖాపరమైన సంక్షేమ నిధుల ద్వారా సహాయాన్ని త్వరితగతిన విడుదల చేసినట్లు తెలిపారు. ఆర్థిక సాయంతో పాటు బాధిత కుటుంబాలకు ప్రభుత్వం నుంచి అందాల్సిన గ్రాట్యుటీ, పెన్షన్ తదితర ప్రయోజనాలు, క్లెయిమ్‌లను ఎలాంటి జాప్యం లేకుండా అందేలా చర్యలు తీసుకుంటామన్నారు.
అలాగే కారుణ్య నియామకాలకు సంబంధించిన ప్రక్రియను కూడా వేగవంతంగా పూర్తి చేసేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని స్పష్టం చేశారు. దివంగత పోలీసు సిబ్బంది కుటుంబాలకు పోలీసు శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ డి. విశ్వనాథ్, జిల్లా పోలీసు అసోసియేషన్ అధ్యక్షుడు సి.హెచ్. మోజేష్‌తో పాటు ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
