Kaikaluru : మత్స్యకారుడికి రూ.24 లక్షల ఇన్సులేటెడ్ వాహనం.. తాళం నమూనా అందజేసిన ఎమ్మెల్యే కామినేని
ఏలూరు జిల్లా : కైకలూరు : స్వచ్ఛవార్త :
ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద 40 శాతం రాయితీతో మంజూరైన రూ.24 లక్షల విలువైన ఇన్సులేటెడ్ వాహనాన్ని లబ్ధిదారుడు కొండపల్లి శ్యాంబాబుకు కైకలూరు ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అస్యూరెన్స్ కమిటీ చైర్మన్ డా. కామినేని శ్రీనివాస్ మంగళవారం అందజేశారు. కైకలూరు మండలం కైకలూరులోని ట్రావెలర్స్ బంగ్లాలో జరిగిన కార్యక్రమంలో వాహన తాళం నమూనాను లబ్ధిదారుడికి అందించారు.
ఈ సందర్భంగా కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ..
కూటమి ప్రభుత్వం పేదలకు జీవనోపాధి కల్పించడమే ప్రధాన లక్ష్యంగా అనేక పథకాల ద్వారా సబ్సిడీలను అందిస్తూ అండగా నిలుస్తోందన్నారు. అందులో భాగంగానే మత్స్యశాఖ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద 40 శాతం రాయితీతో ఇన్సులేటెడ్ వాహనాన్ని మంజూరు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ సబ్సిడీలను సద్వినియోగం చేసుకుని లబ్ధిదారులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో మాజీ శాసనమండలి సభ్యుడు కమ్మిలి విఠల్‌రావు, నియోజకవర్గ టీడీపీ కన్వీనర్ కొత్త నాగేంద్రకుమార్, ఎన్డీఏ నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
