Kaikaluru Rural Circle : వినాయక ఉత్సవాల్లో నిబంధనలు పాటించాలి : కైకలూరు రూరల్ సీఐ వి.రవికుమార్
ఏలూరు జిల్లా : కైకలూరు రూరల్ సర్కిల్ : స్వచ్ఛవార్త :
వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని, ప్రభుత్వ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని కైకలూరు రూరల్ సీఐ సూచించారు. శనివారం సర్కిల్ పరిధిలోని కైకలూరు రూరల్, మండవల్లి, ముదినేపల్లి మండలాల వినాయక చవితి కమిటీ సభ్యులకు ఉత్సవాల నిర్వహణపై పలు సూచనలు చేశారు.
విగ్రహాల ఏర్పాటు, ఊరేగింపు, నిమజ్జనం సమయంలో నిర్వాహకులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. డీజేలు, మైక్‌ల వినియోగంలో శబ్ద పరిమితులు పాటించాలని, ఊరేగింపుల సమయంలో ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చూడాలని తెలిపారు. విద్యుత్ తీగలు, అగ్ని ప్రమాదాలు, జనసమ్మర్దం విషయంలో అప్రమత్తంగా ఉండాలని, నిమజ్జనం సమయంలో ప్రమాదాలు జరగకుండా తగిన భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు.
మద్యం సేవించి ఊరేగింపుల్లో పాల్గొనడం, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడటం, ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా వ్యవహరించడం వంటివి చేయరాదని హెచ్చరించారు. ఉత్సవాల నిర్వహణలో పోలీసులకు పూర్తిగా సహకరించాలని కమిటీ సభ్యులను కోరారు. నిబంధనలు ఉల్లంఘించినా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించినా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
సీఐ సూచనల మేరకు కైకలూరు రూరల్ ఎస్సై రాంబాబు, మండవల్లి ఎస్సై రామచంద్రరావు, ముదినేపల్లి ఎస్సై వీరభద్రరావు తమ తమ పరిధిలో కమిటీ సభ్యులతో సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పించారు. ముదినేపల్లి మండలంలో ఎస్సై వీరభద్రరావు ఏర్పాటు చేసిన సమావేశంలో విద్యుత్, రెవెన్యూ, ఎంపీడీవో శాఖల అధికారులు కూడా పాల్గొని ఉత్సవాల నిర్వహణపై సూచనలు చేశారు.


